చంద్రబాబుకు గుంటూరు జిల్లా టిడిపి షాక్

అవును రాజధాని జిల్లా గుంటూరులోని తెలుగుదేశంపార్టీ నేతలు చంద్రబాబునాయుడుకు పెద్ద షాకే ఇచ్చారు. పార్టీ నేతలతో మాట్లాడేందుకు చంద్రబాబు రెగ్యులర్ గా వీడియో, టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ కాన్ఫరెన్సులకు మిగిలిన జిల్లాల నేతలు హాజరవుతుంటే గుంటూరు జిల్లా నేతలు మాత్రం హాజరు కావటం లేదట. చంద్రబాబు ఒకటికి రెండుసార్లు హెచ్చరించినా లెక్క చేయటం లేదంటే పరిస్ధితి ఎంతలా ముదిరిపోయిందో అర్ధమైపోతోంది.

 

కొద్ది రోజుల క్రితం జరిగిన టెలికాన్ఫరెన్సులో చంద్రబాబు మాట్లాడుతూ, ఎన్నికలయ్యేదాకా నేతలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికలయ్యేదాకా పార్టీలో పొలిటికల్ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు చెప్పారు. సభ్యత్వ నమోదు విషయం మాట్లాడుతూ జిల్లా నేతలందరికీ అక్షింతలేశారు. గుంటూరు జిల్లా పార్టీ నేతలకు అతి విశ్వాసం ఎక్కువైపోయిందంటూ మండిపడ్డారు. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నట్లు తీవ్రంగా ఆక్షేపించారు. అలసత్వంగా ఉన్న నేతలెవరనీ సహించేది లేదని హెచ్చరించారు. సరే చంద్రబాబు హెచ్చరికలు అందరి నేతలకు చేరింది. అంటే అప్పుడు జరిగిన టెలికాన్ఫరెన్సులో జిల్లా నేతలెవరూ పాల్గొనలేదు. దాంతో జిల్లా ఇన్చార్జి మంత్రి మిగిలిన నేతలకు చంద్రబాబు హెచ్చరికలను తెలియజేశారు.

 

కొద్ది రోజుల తర్వాత జరిగిన టెలికాన్ఫరెన్సులో అందరు నేతలు పాల్గొన్నారు. తన హెచ్చరికల మహిత్యమని చంద్రబాబు అనుకున్నారు. తీరా చూస్తే ఆ తర్వాత మళ్ళీ జరిగిన టెలికాన్ఫరెన్సుల్లో ఎవరూ పాల్గొనలేదు. దాంతో చంద్రబాబుకు ఏమి చేయాలో అర్ధం కాలేదు. అదే కాదు ఆ తర్వాత జరిగిన రెండు కాన్ఫరెన్సులకు హాజరుకాలేదట. గుంటూరు జిల్లా నేతలు తనకన్నా బిజీగా ఉన్నారేమో అని చంద్రబాబుకు అనుమానం వచ్చింది. అదే విషయాన్ని జిల్లా అధ్యక్షుడు, వినుకొండ ఎంఎల్ఏ జీవి ఆంజనేయులను అడిగారు చంద్రబాబు.

 

ఇక సభ్యత్వాల విషయం తీసుకున్న అందులో కూడా జిల్లా వెనకబడే ఉందట. మంత్రులను, ఎంఎల్ఏలను హెచ్చరించినా ఉపయోగం కనబడక పోవటంతో ఏం చేయాలో చంద్రబాబుకే దిక్కుతోచటం లేదు. మంత్రులు, ఎంఎల్ఏలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అయినా పార్టీ సభ్యత్వం బాగుందా అంటే అదీ లేదు. పైగా ఎంఎల్ఏ లేని నరసరావుపేట నియోజకవర్గమే సభ్యత్వ నమోదులో జిల్లాలోనే మొదటిస్ధానంలో నిలిచిందట. దాంతో జిల్లా నేతలను దారికి ఎలా తీసుకురావాలా అని చంద్రబాబు ఆలోచిస్తున్నారట ఇఫుడు. రాజధాని జిల్లాలోనే పార్టీ నేతల పరిస్ధితి ఇలాగుంటే ఎలాగని సీనియర్లు కూడా తెగ టెన్షన్ పడిపోతున్నారు.