టీడీపీ – జనసేన కూటమికి అభ్యర్థులున్నారా.?

2024 ఎన్నికలకు ఎంతో సమయం లేదు.! ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్.. అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.! అదే నిజమైతే, మ్యానిఫెస్టోల రూపకల్పన సహా అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం.. ఇవన్నీ అంత తేలికైన వ్యవహారం కాదు ఏ రాజకీయ పార్టీకి అయినా.

ముందస్తు ఎన్నికలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఎప్పటినుంచో వేడెక్కి వున్నాయి. అధికార వైసీపీ, అస్త్ర శస్త్రాలన్నిటినీ ఇప్పటికే సిద్ధం చేసుకుంది. గడప గడపకీ మన ప్రభుత్వం సహా అనేక కార్యక్రమాలతో వైసీపీ నేతలు, మరీ ముఖ్యంగా ప్రజా ప్రతినిథులు జనంలో వుంటున్నారు.

విపక్షాల పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. అత్యంత గందరగోళం నడుమ ఎలాగోలా పూర్తయ్యింది. ఇంకోపక్క, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి, కొన్నాళ్ళపాటు జైల్లో వుండటం, టీడీపీకి పెద్ద మైనస్.

ఇక, పొలిటికల్ టూరిస్టుగా మారిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంగతి సరే సరి.! రాష్ట్రంలో పొలిటికల్ వాక్యూమ్‌ని భర్తీ చేసేందుకు అవకాశం వున్నా, ఆ దిశగా సరైన వ్యూహాలు పవన్ కళ్యాణ్ దగ్గర లేకుండా పోయాయి. కింది స్థాయిలో జనసైనికులు మాత్రం చాలా చాలా కష్టపడి పనిచేస్తున్నారు పార్టీ కోసం.

ఇంతకీ, టీడీపీ – జనసేన కూటమికి వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులున్నారా.? లేదా.? ఈ విషయమై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది రాష్ట్ర ప్రజల్లో. ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారన్నదానిపై ఆయా పార్టీలకే స్పష్టత లేకుండా పోయింది. జనసేన తరఫున ఓ అరవై మంది వరకు ఆశావహులు, కింది స్థాయిలో గట్టిగానే పని చేస్తున్నారు.

టీడీపీ నుంచి ఆ మాత్రం జోరు కూడా కనిపించడంలేదు. అయితే, టీడీపీకి బలమైన క్యాడర్ వుంది. పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లొస్తాయ్ అన్నది ఆ పార్టీలో ఎవరికీ తెలియట్లేదు. ఇప్పటిదాకా జనసేన తరఫున పనిచేసిన అభ్యర్థులు, పొత్తులో భాగంగా టీడీపీకి తమ సీట్లు ఇవ్వాల్సి వస్తే, ఆ కథ వేరేగా వుంటుంది.

సంక్రాంతి తర్వాతగానీ సీట్ల పంపకాలపై పితలాటకం ఓ కొలిక్కి వచ్చేలా లేదన్నది తాజా ఖబర్. అదే జరిగితే, పొత్తు వృధా ప్రయాసే అవుతుందేమో.!