ఇంతకన్నా భిన్నంగా ఆశించగలమా ?

ఐటి దాడులకు భయపడేది లేదు…

ఐటి అధికారులు ఏం చేయగలరు ?

ఐటి అధికారులు వస్తుంటారు, పోతుంటారు…

ఇవి కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశంపార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి  తాజాగా చేసిన వ్యాఖ్యలు. సుజనా మాటలు వింటుంటే నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అని పెద్దలు చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయ్. ధనార్జనే ధ్యేయంగా అన్ని విలువలను వదిలేసి, అన్నీ వ్యవస్ధలను నిర్వీర్యం చేసేసిన టిడిపి ప్రజా ప్రతినిధులు ఇంతకన్నా భిన్నంగా మాట్లాడుతారని ఆశించేందుకు లేదు. ఎందుకంటే, వ్యవస్ధల మీద నమ్మకం, గౌరవం ఉన్నవారు ఎవరూ ఇలా మాట్లాడరు.

 

ఎందుకంటే, సుజనా మీద కూడా లెక్కలేని అవినీతి ఆరోపణలున్నాయి. ఆయన వ్యాపారాల్లో వివిధ రకాలుగా పన్నులను ఎగొట్టారనే కేసులు నడుస్తున్నాయి. మారిషస్ బ్యాంకులో అప్పు తీసుకుని రూ 100 కోట్లు ఎగొట్టారనే కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఇప్పటికే కేసు విచారణకు హాజరుకాలేదని ఒకసారి సుజనా కేంద్రమంత్రిగా ఉన్నపుడే నాం పల్లి కోర్టు నాన్ బెయిలబుల్  అరెస్టు వారెంటు జారీ చేసింది. తర్వాత జరిగిన విచారణలో  బ్యాంకును సుజనా మోసం చేశారని కూడా తేల్చేసింది. సరే సుజనా పై కోర్టుకెళ్ళారనుకోండి అది వేరే సంగతి.

 

ఎక్కడబడితే అక్కడ ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్న వారికి రాజకీయధికారం తోడవ్వటం, దానిపై వివిధ వ్యవస్ధల్లో అపారమైన పట్టుండటంతో చెలరేగిపోతున్నారు. అందుకే ఐటి దాడులపై అంత నిర్లజ్జగా, చులకనగా మాట్లాడగలుగుతున్నారు. ఐటి అధికారులు వస్తారు, పోతారట. అధికారులు కాదు వచ్చి వెళ్ళేది, పాలకులే.

 

రేపటి ఎన్నికల్లో జనాలు తెలుగుదేశంపార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తే అప్పుడు తెలుసొస్తుంది వాస్తవం ఏంటో. తనపై ఈడి దాడులు, సిఎం రమేష్ పై జరిగిన ఐటి దాడులను కక్ష సాధింపులో భాగమనే సుజనా చెబుతున్నారు. టిడిపిలో అంతమంది రాజ్యసభ, లోక్ సభ సభ్యులున్నారు. మంత్రులు, ఎంఎల్ఏలున్నారు. నేతలున్నారు. వాళ్ళలో ఎవరిపైనా జరగని ఐటి, ఈడి దాడులు వీళ్ళపైనే ఎందుకు జరుగుతోందో సుజనా చెప్పగలరా ?