నారాయణకు ఫిట్టింగ్ పెట్టిన చంద్రబాబు  

వచ్చే ఎన్నికల్లో మంత్రి పి. నారాయణ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అదృష్టమని ఎందుకు అనాల్సొచ్చిందంటే, మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్నారు కాబట్టి.  నెల్లూరు సిటి నియోజకవర్గంలో పోటీ చేయించటం ద్వారా చంద్రబాబు భలే ఫిట్టింగ్ పెట్టారు.  ప్రతిపక్ష వైసిపి తరపున సిట్టింగ్ ఎంఎల్ఏ అనీల్ కుమార్ యాదవ్ రూపంలో గట్టి ప్రత్యర్ధి ఉన్నాడు. చంద్రబాబునాయుడుకు సన్నిహితుడని, టిడిపికి ఫైనాన్షియరన్న హోదాలో పోయిన ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రాగానే ఎంచక్కా మంత్రయిపోయారు. నిజానికి అప్పటి వరకూ నారాయణకు అసలు ప్రజా జీవితంతో ఏమీ సంబంధం లేదనే చెప్పాలి.

 

దాదాపు మూడేళ్ళపాటు ప్రజా ప్రతినిధులందరినీ నారాయణ నెల్లూరు జిల్లాలో తొక్కేసి అధికారాన్ని బాగానే చెలాయించారు. దాంతో జిల్లాలోని చాలామంది సీనియర్ నేతలతో నారాయణకు పడటం లేదు. వచ్చే ఎన్నికల్లో నారాయణను చంద్రబాబు నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి రంగంలోకి దింపుతున్నారు. పోటీ చేయటమనేది నారాయణ చేతిలోనే ఉన్నా గెలుపు మాత్రం మంత్రి చేతిలో లేదుకదా ? సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయాలని మంత్రి చాలా కాలం క్రితమే ప్లాన్ చేశారు.

 

ఎప్పుడైతే నియోజకవర్గాన్ని మంత్రి ఫైనల్ చేసుకున్నారో అప్పటి నుండే దృష్టి సారించటం మొదలుపెట్టారు. సరే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మంత్రికున్న గెలుపోటముల అవకాశాలను ఒకసారి చూద్దాం. మంత్రికి ఈ నియోజకవర్గంలో గెలవటానికి రెండు ప్రధాన అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిది నెల్లూరు పట్టణంలో నిర్మించిన పేదల హౌసింగ్ స్కీం. రాష్ట్రంలో ఈ పథకం అమలు ఎలా జరుగుతోందన్నది పక్కన పెట్టినా నియోజకవర్గంలో మాత్రం బాగా అమలు చేశారు.

 

ఎన్నికల్లో పోటీని దృష్టిలో పెట్టుకునే నారాయణ ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. సుమారు 10 వేలమంది లబ్దిదారులకు ఇళ్ళ కేటాయింపు కూడా అయిపోయింది. ఇంటికి మూడుడ ఓట్లు వేసుకున్నా తక్కువలో తక్కువ 30 వేల ఓట్లు పడాలి. ఇక రెండో అంశం డబ్బు. ఆర్ధికపరంగా నారాయణ ఎంతటి బలవంతుడో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అదే సమయంలో నియోజకవర్గంలో సుమారు 70 వేల ఓట్లు గల్లంతయ్యాయి. అందులో ఎక్కువ భాగం వైసిపి ఓట్లే అని చెప్పక్కర్లేదు. ఎక్కడైనా ఓట్లు గల్లంతయ్యాయంటే అవి వైసిపి ఓట్లనే అనుకోవచ్చు. లేకపోతే గల్లంతవ్వాల్సిన అవసరం లేదు. గల్లంతైన ఓట్లలో తిరిగి కొన్ని యాడ్ అయినా 70 వేల ఓట్లూ యాడ్డ కావుకదా .

 

ఇక మైనస్ పాయింట్లను చూద్దాం. వైసిపి సిట్టింగ్ ఎంఎల్ఏ అనీల్ కుమార్ యాదవ్ బలమైన ప్రత్యర్ధి. ప్రభుత్వంపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోంది. దానికితోడు ఈ నియోజకవర్గంలో పోటీ చేయటానికి మేయర్ అబ్దుల్ మజీద్ చాలా ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. అబ్దుల్ కు టిక్కెట్టు రాకపోవటంతో మైనారిటీల 20 వేల ఓట్లు నారాయణకు పడేది అనుమానమే. నిజంగానే  జనాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే ఇళ్ళ నిర్మాణం, ఓట్ల గల్లంతు లాంటివి కూడా నారాయణను కాపాడలేవన్న విషయం తెలిసిందే. మరి మొదటిసారిగా పోటీ చేస్తున్న నారాయణ అదృష్టం ఎలాగుందో చూడాల్సిందే.