చంద్రబాబు అంత ధైర్యం చేయగలరా ?

చంద్రబాబునాయుడు ఢిల్లీలో దీక్ష అయిపోయింది. ఏపి భవన్ కేంద్రంగా జరిగిన దీక్షకు మద్దతుగా జాతీయ పార్టీల నేతలు కొందరు వచ్చారు. చంద్రబాబును పరామర్శించారు, నరేంద్రమోడిని తిట్టేసి వెళ్ళిపోయారంతే. ఒక్కరు కూడా ఏపికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామన్న హామీని ఇవ్వలేదు. పోయిన ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన మోడి, చంద్రబాబు, పవన్ ఇపుడు వైరిపక్షాలైపోయారు. దాంతో కుమ్ములాటలు తారాస్ధాయికి చేరుకుంది. విభజన హామీలను అమలు చేస్తామన్నారు. ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్ అంశం గురించి అప్పట్లో ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నింటినీ మూటగట్టేసి అటకెక్కించారు.

హామీలను అటకెక్కించింది అందరూ కలిసే జాయింట్ గా చేశారులేండి. ఎప్పుడైతే మోడితో చెడిందో అప్పటి నుండే చంద్రబాబు అటకెక్కించిన హామీలు ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. ఇక అప్పటి నుండి మోడిని తిట్టని రోజంటూ లేదు. తన చేతకాని తనాన్ని ప్రధానమంత్రిపైకి నెట్టేసి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో లబ్దిపొందాలన్న ప్లాన్ ఏ మేరకు వర్కవుటవుతుందో ఇప్పటికైతే తెలీదు.

సరే ఆ విషయాలన్నింటినీ పక్కనపెట్టేద్దాం. బిజెపియేతర పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెస్తానని చంద్రబాబు పెద్ద బిల్డప్ ఇస్తున్న విషయం తెలిసిందే. అంటే ఇప్పటికే ఎన్డీఏతో విబేధించి పార్టీల్లో కొన్ని ఎప్పటినుండో యూపిఏలో కొనసాగుతున్నాయిలేండి. వాటినే తాను ఏకతాటిపైకి తెస్తానని బిల్డప్ ఇస్తున్నారు. కాకపోతే తాము అధికారంలోకి వస్తే ఏపికి ప్రత్యేకహోదా ఇస్తామని ఒక్కపార్టీతో కూడా చెప్పించలేకపోయారు.

మొన్న లోక్ సభలో జరిగిన అవిశ్వాస తీర్మానంలో కూడా అందరూ మోడిని తిట్టారే కానీ ఒక్కళ్ళు కూడా ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే అని చెప్పలేదు. పోనీ చంద్రబాబైనా హోదాకు అనుకూలంగా ఓ తీర్మానం రూపంలో పార్టీల మద్దతు కూడగడుతున్నారా అంటే అదీ లేదు. అటు వాళ్ళూ హోదాకు మద్దతు పలకటం లేదు. ఇటు చంద్రబాబు కూడా తీర్మానం రూపంలో సంతకాలు తీసుకోవటం లేదు.

ఎందుకంటే, మోడిని తిట్టటానికి చంద్రబాబు ఏర్పాటు చేసిన వేదికను ఉపయోగించుకుంటున్నారే కానీ నిజంగా ఏపికి ప్రత్యేకహోదా విషయంలో ఎవరూ మద్దతిస్తున్నట్లు లేదు. ప్రత్యేకహోదా విషయంలో ఏపికి మద్దతిస్తే వాళ్ళకి వాళ్ళ రాష్ట్రాల్లో అంతే సంగతులు. ఆ విషయం తెలిసే చంద్రబాబు కూడా సంతకాలు తీసుకునే ధైర్యం చేయలేకపోతున్నారు.