‘మంత్రి నుండి పార్టీని రక్షించండి’..చంద్రబాబు, మంత్రులిద్దరికీ షాక్

ఒకవైపు అభ్యర్ధుల ఎంపికపై సమీక్షలతో చంద్రబాబునాయుడు బిజీగా ఉన్న సమయంలోనే కొవ్వూరు నియోజకవర్గంలోని నేతలు సిఎంతో పాటు మంత్రి కెఎస్ జవహర్ కు కూడా షాక్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో మంత్రి కెఎస్ జవహర్ కు తిరిగి టికెట్ ఇవ్వద్దటు భారీ ఎత్తున పట్టణంలో ఈ రోజు ఉదయం ర్యాలీ నిర్వహించారు. మంత్రికి వ్యతిరేకంగా పలువురు నేతలు ఏకమై తీవ్రంగా  వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై మంత్రికి, వ్యతిరేక గ్రూపుకు మధ్య పంచాయితీ చేయాలని చంద్రబాబు అనుకున్నా సాధ్యం కాలేదు. దాంతో ఎన్నికల ముందు పంచాయితీ విషయం మరింత వివాదాస్పదమైంది.

రాబోయే ఎన్నికల్లో కెఎస్ జవహర్ కు టికెట్ కేటాయిస్తే కచ్చితంగా ఓడిపోవటం ఖాయమంటూ చాలా కాలంగా చంద్రబాబు  ముందే నియోజకవర్గానికి చెందిన కొందరు నేతలు చెబుతున్నారు. అదే సమయంలో మంత్రికి అనుకూలంగా మరికొందరు నేతలు చంద్రబాబు ముందు తమ మద్దతు తెలుపుతున్నారు. దాంతో రెండు వర్గాలు కూడా నియోజకవర్గంలో వేటికవే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. దాంతో ఈ ప్రభావం జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల మీద కూడా పడుతోంది.

కొవ్వూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన మంత్రి వ్యతిరేకులు కెఎస్ జవహర్ నుండి పార్టీని రక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలివ్వటం గమనార్హం. మంత్రికి వ్యతిరేకంగా పట్టణంలోనే కాకుండా రూరల్ ప్రాంతాల్లో కూడా నిర్వహించారు. మంత్రి వ్యతిరేకవర్గంలో కీలకమైన మున్సిపల్ మాజీ  ఛైర్మన్  సూరపునేని రామ్మోహన్ రావు, సీనియర్ నేత ఉప్పులూటి నారాయణరావు తదితరులు ర్యాలీకి నాయకత్వం వహించారు. మంత్రికి టికెట్ ఇస్తే పార్టీ ఓటమి ఖాయమని జోస్యం కూడా చెప్పారు.

ఒకవైపు చంద్రబాబు అభ్యర్ధులను ఫైనల్ చేయటానికి సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో నేతలు వారి మద్దతుదారుల మధ్య కుమ్ములాటలు రోడ్డున పడుతున్నాయి. ఈ పరిస్దితుల్లో అభ్యర్ధులను ఖరారు చేసి ప్రకటించటం చంద్రబాబుకు తలనొప్పులుగా తయారైంది. నేతల మధ్య పంచాయితీలే చేయాలా ? లేకపోతే అభ్యర్ధుల ఖరారుపై దృష్టి పెట్టాలో తెలీక చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది.