ఇది నిజమే అయితే, తెలుగు రాజకీయాల్లో ఇదొక సంచలనమే అవుతుంది.! ఔను, భారత్ రాష్ట్ర సమితి వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో అన్ని నియోజక వర్గాల్లోనూ పోటీ చేస్తుందట.
‘మేం ఏమీ ఆషామాషీగా తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చలేదు. మాకు జాతీయ లక్ష్యాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అన్ని సీట్లలోనూ పోటీ చేస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని నియోజకవర్గాల్లోనే పోటీ చేస్తామని మా గురించి ప్రచారం జరుగుతోంది. అది నిజం కాదు. అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేసి తీరతాం..’ అని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
ఇక్కడ అన్ని నియోజకవర్గాలూ.. అంటే, అసెంబ్లీ నియోజకవర్గాలా.? లోక్ సభ నియోజకవర్గాలా.? బహుశా రెండోదే అయి వుండొచ్చు. ఏమో, పరిస్థితులు అనుకూలిస్తే, అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పోటీకి దిగుతుందేమో.
ఈ ఏడాది చివర్లో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఎన్నికలు జరుగుతాయనే ఓ అభిప్రాయం బలంగా వినిపిస్తోంది రాజకీయ విశ్లేషకుల్లో. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలకు అవకాశాలు తక్కువే.
అది కూడా బీఆర్ఎస్‌కి కలిసొచ్చే అంశమే.తొలుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సంగతి చూసి, ఆ తర్వాత ఏపీలోనూ పార్టీ విస్తరించడానికి వీలు కుదురుతుంది. అయితే, అన్ని నియోజకవర్గాల్లోనూ.. అంటే, అది కేవలం అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే అయినా, కేవలం లోక్ సభ నియోజకవర్గాల్లోనే అయినా.. రెండూ అయినా.. అంత తేలిక కాదు.! సగం లోక్ సభ నియోజకవర్గాల్లో కూడా పోటీ చేసేంత సీన్ బీఆర్ఎస్‌కి ప్రస్తుతం ఏపీలో లేదు.
