జనసేన పార్టీ వైపు ‘తమ్ముళ్ళు’ చూస్తున్నారట.! ఇదో చిత్రమైన రాజకీయం. వైసీపీలో టిక్కెట్ కష్టం అనుకుంటున్న కొందరు నేతలు, ముందుగా తమ కుటుంబ సభ్యుల్ని జనసేనలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీలో టిక్కెట్ ఖాయమనుకుంటున్న నేతలదీ ఇదే పరిస్థితి. చీరాల మాజీ ఎమ్మెల్యే, పర్చూరు వైసీపీ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్ ప్రస్తుతానికి వైసీపీలోనే వున్నా, ఆయన పార్టీ మారే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఆయన సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు జనసేన పార్టీకి మద్దతుదారుడిగా మారిపోయారు.
ఈ మేరకు జనసేన ఫ్లెక్సీల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తోపాటు, ఆమంచి శ్రీనివాసరావు ఫొటోలు సందడి చేస్తున్నాయి. కొందరి ‘ఆమంచి’ అభిమానులు, కృష్ణమోహన్ ఫొటోల్ని కూడా జనసేన ఫ్లెక్సీల మీద ముద్రిస్తుండడం గమనార్హం. ఈ ఫ్లెక్సీల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.
అయితే, ఆమంచి మాత్రం ఇంతవరకు ఈ వ్యవహారంపై స్పందించలేదు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ సమయంలో కూడా ఇలాగే జరిగింది. చాలామంది నాయకులు తమ సోదరుల్ని అప్పట్లో ప్రజారాజ్యం పార్టీలోకి పంపించారు. ఆ తర్వాత ఆయా నాయకులు నేరుగా ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళారు. కానీ, అందులో చాలామంది ఇమడలేకపోయారు.
జనసేన విషయంలో ఏం జరగబోతోంది.? ప్రధాన ప్రతిపక్షం టీడీపీని వదిలేసి, వైసీపీ నుంచి నేరుగా జనసేనలోకి వైసీపీ నాయకులు ఎందుకు దూకుతున్నట్టు.?