కాళ్లు పట్టుకుని సాధించుకోవాలా.. బొత్స సత్యనారాయణ కామెంట్లు కరెక్టేనా?

ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు విషయంలో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా తమకు కావాల్సిన పని జరగాలంటే లంచం ఇవ్వడం మినహా మరో మార్గం లేదని చాలామంది భావిస్తారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులలో కూడా ఎంతోమంది మంచి ఉద్యోగులు ఉన్నారు. ప్రజల కోసం పని చేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించే ఉద్యోగుల సంఖ్య తక్కువేం కాదు.

అయితే వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకత లేదని ప్రభుత్వం కోరితే ప్రభుత్వంతో సమస్యల గురించి చర్చించడానికి సిద్ధమేనని వెల్లడించారు. సీఎం జగన్ తో మాట్లాడి సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

అయితే సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సచివాలయ ఉద్యోగులు ఓపిక పట్టాలని బొత్స సత్యనారాయణ కామెంట్లు చేశారు. పోరాటం చేయడం ద్వారా మాత్రమే సమస్యలను పరిష్కరించుకోవాలని భావించడం కరెక్ట్ కాదని కాళ్లు పట్టుకొని బ్రతిమలాడి అయినా సమస్యలను పరిష్కరించుకోవాలనే నేర్పు, లౌక్యం ఎంతో అవసరమని బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.

అయితే ఉద్యోగుల పరువుకు భంగం కలిగే విధంగా బొత్స సత్యనారాయణ కామెంట్లు చేయడం సరికాదని రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. అనవసర కామెంట్ల వల్ల ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య దూరం పెరుగుతుందని ఉద్యోగులు కామెంట్లు చేస్తున్నారు.