ఊరంటే స్మశానం కూడా వుంటుంది.! బొత్స రివర్స్ గేర్.!

‘కడుపుకి అన్నం తినేవాడెవడైనా, మనుషులున్న ప్రాంతాన్ని ఉద్దేశించి స్మశానం అంటాడా.?’ అని కొన్నాళ్ళ క్రితం మంత్రి బొత్స సత్యనారాయణపై అమరావతి ప్రాంత ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కారణం లేకపోలేదు.! ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెప్పు కోసం అమరావతిని స్మశానంగా, ముంపు ప్రాంతంగా అభివర్ణించారు బొత్స సత్యనారాయణ. అయితే, బొత్స వాయిస్ ఇప్పుడు మారింది. అమరావతిని నివాసయోగ్యమైన ప్రాంతంగానే అభివర్ణించారు. అప్పట్లో తాను స్మశానం అన్న వ్యాఖ్యల వెనుక పెద్ద అర్థమే వుందనీ, ఊరన్నాక స్మశానం కూడా వుంటుందనీ కవరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.

తమ ప్రభుత్వ విధానం మూడు రాజధానులేననీ, న్యాయపరమైన చిక్కులు తొలగితే రేపటినుంచే విశాఖ వేదికగా పాలన మొదలవుతుందనీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లోపు న్యాయ పరమైన చిక్కులు తొలగకపోతే, మూడు రాజధానుల నినాదంతోనే ఎన్నికలకు వెళతామనీ బొత్స చెప్పుకొచ్చారు.

ఉత్తరాంధ్రలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై బొత్స స్పందించారు. ఓటమి తనకు బాధ కలిగించిందనీ, ఓటమి బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారాయన. రాజకీయాలన్నాక గెలుపోటములు సహజమనీ రాజకీయ వేదాంతం బొత్స సత్యనారాయణ చెప్పారు. ఏంటో ఈ రాజకీయం. అప్పుడేమో రాజధాని అమరావతి స్మశానం, ఎడారి, ముంపు ప్రాంతం. ఇప్పుడేమో నివాస యోగ్యమైన ప్రాంతంగా మారిపోయింది బొత్స దృష్టిలో. అన్నట్టు, లక్షల కోట్ల ప్రజాధనాన్ని అమరావతి గోతుల్లో పారబోయాలా.? అంటూ అమరావతిపై తనదైన స్టయిల్లో విమర్శలు చేశారు బొత్స.