రాజకీయాల్లో హింసకు తావు లేదు.. ఈ మాట చెప్పడానికి బాగానే వుంటుంది. అసలంటూ హింసలేని రాజకీయం సాధ్యమా.? ఛాన్సే లేదు ఈ రోజుల్లో.! రాజకీయమంటే ఆధిపత్య పోరు.! కులాల, మతాల మధ్య.. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే నయా రాజకీయం.! హింస, రక్తపాతం అనేవి రాజకీయాల్లో కొత్త విషయాలు కాదు. కాకపోతే, అది మరీ శృతిమించుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ పేరుతో రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. వాటిని అడ్డుకునేందుకు అధికార పార్టీ విశ్వప్రయత్నాలూ చేస్తోంది.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు రాజకీయాల్లో సర్వసాధారణమైపోయాయి. దాదాపుగా అందరూ ‘లం..’ భాషనే మాట్లాడేస్తున్నారు.. ఎవరో కొందరు తప్ప.! దాంతో, సహజంగానే.. దాడులు, ప్రతిదాడులు షురూ అవుతాయి. వైసీపీ సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లక్ష్యంగా పుంగనూరులో ‘షో’ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.
అది కాస్తా ఉద్రిక్తంగా మారింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలే కాదు, పోలీసులూ తీవ్రంగా గాయపడ్డారు. విధి నిర్వహణలో భాగంగా పోలీసులు, అల్లర్లను అదుపు చేయాల్సి వచ్చింది.. ఈ క్రమంలో వారి మీదా రాజకీయ దాడులు జరిగాయి.. అదీ ఇరువైపుల నుంచీ.!
అటు వైసీపీ కావొచ్చు, ఇటు టీడీపీ కావొచ్చు.. సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్లు.? రాజకీయమంటే రక్తపాతమేనా.? రాళ్ళు రువ్వుకుని.. తలలు పగలగొట్టుకుని.. ఇదేం రాజకీయం.? పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని ఇరు పార్టీలూ చెప్పుకోకపోతే ఎలా.? పైగా, రెచ్చగొట్టడం ఒకటి.
ఇతర పార్టీల కార్యాలయాల్లోకి, కార్యక్రమాల్లోకీ చొచ్చుకెళ్ళడం అనేది ఇటీవలి కాలంలో వైసీపీ చేస్తోన్న అతి పెద్ద తప్పిదం.! ఇది రాజకీయం కాదు.! టీడీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టడం సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబుకీ తగదు.!