ఒకటోస్సారి.. రెండోస్సారి.! బీజేపీలో, బీజేపీ నేతలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవడం ఇది రెండోస్సారి. ఇస్లాం మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నుపుర్ శర్మపై బీజేపీ గుస్సా అయిన విషయం విదితమే. అంతర్జాతీయ సమాజం దృష్టిలో, భారతదేశాన్ని దోషిగా నిలబెట్టాయి నుపుర్ శర్మ వ్యాఖ్యలు. సర్వోన్నత న్యాయస్థానం కూడా నుపుర్ శర్మకి చీవాట్లు పెట్టింది.
అది జాతీయ, అంతర్జాతీయ స్థాయి వ్యవహారం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఆంధ్రప్రదేశ్ వ్యవహారం. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ సాయం బీజేపీ కోరిందా లేదా.? ఈ విషయమై బీజేపీ నేత సత్యకుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అసలు వైసీపీని సంప్రదించలేదన్నారు సత్యకుమార్.
ఈ వ్యవహారంపై వైసీపీ సీరియస్ అయ్యింది. వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ‘ఆటలో అరటిపండు..’ అంటూ సత్యకుమార్ మీద సెటైర్లేశారు. మరోపక్క, బీజేపీ అధిష్టానం కూడా సత్యకుమార్ మీద గుస్సా అయ్యింది. ఇంకోసారి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దంటూ సత్యకుమార్‌కి వార్నింగ్ కూడా ఇచ్చిందట బీజేపీ.
కేంద్ర మంతి గజేంద్ర షెకావత్ ఈ విషయమై మాట్లాడుతూ, సత్యకుమార్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమనీ, పార్టీకి సంబంధం లేదని తేల్చేశారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం వైసీపీ మద్దతు కోరామని, వైసీపీ మద్దతు ప్రకటించిందనీ గజేంద్ర షెకావత్ చెప్పారు.
ఈ వ్యవహారంతో ఒక్కసారిగా ఏపీ బీజేపీ నేతలు షాక్‌కి గురయ్యారు. అధిష్టానంతో అసలు ఏపీ బీజేపీ నేతలకు కమ్యూనికేషన్ వుందా.? లేదా.? అన్న చర్చ ఏపీ బీజేపీకి చెందిన చాలామంది నేతల మధ్య జరుగుతుండడం గమనార్హం.