మారుతున్న కాలానికి అనుగుణంగా దేశం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోక తప్పదనీ, స్టీలు ప్లాంటు ప్రయివేటీకరణలో దేశ భవిష్యత్తును చూడాలి తప్ప.. ప్రాంతీయ వాదాలు, అడ్డగోలు వాదనలు తీసుకురాకూడదనీ, ఉచిత సలహా ఇస్తున్నారు ఏపీ బీజేపీ నేత, ఎమ్మెల్సీ మాధవ్. ఉద్యోగులకు, కార్మికులకు ఎలాంటి నష్టం వాటిల్లబోమని చెబుతున్నారాయన. అసలు స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ జరగనిచ్చేది లేదంటూ కొద్ది రోజుల క్రితం ఏపీ బీజేపీ నేతలు సెలవిచ్చారు. కానీ, ఆ తర్వాత మాట మార్చారు. పెట్టుబడుల ఉపసంహరణ నిజమే కానీ, వంద శాతం పెట్టుబడులు ఉపసంహరిస్తారనే వాదనలో నిజం లేదని మాధవ్ చెబుతున్నారు.
ప్రత్యేక హోదా విషయంలో ఏపీ బీజేపీ ఇలాంటి కథలే చెప్పింది. విడిపోతే నష్టమేమీ ఉండదనీ, ఒక ఓటు, రెండు రాష్ర్టాల నినాదం తెచ్చినప్పుడే, బీజేపీ, ఏపీ ప్రజల్ని ఏమార్చింది. అప్పటికీ, ఇప్పటికీ దేశంలో కమలనాధులది ఒకే నాటకం. పదే పదే అదే నాటకాన్ని ప్రయోగించడం చాలా చాలా ఆశ్చర్యకరం. స్టీలు ప్లాంటు అంటే, ఓ మామూలు పరిశ్రమ కాదు. అది ఆత్మగౌరవ సమస్య. 30 మందికి పైగా ప్రాణ త్యాగం చేస్తే స్టీలు ప్లాంటు వచ్చింది. 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. తెలంగాణా ప్రాంతానికి చెందిన వారు కూడా విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అని నినదించిన సందర్భం అంది. అధిష్టానం ముందు మోకరిల్లడం తప్ప, రాష్ర్ట ప్రయోజనాల కోసం కనీసపాటి బాధ్యత ప్రదర్శించలేని ఏపీ బీజేపీ నాయకుల గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా దండగే.