భారతీయ జనతా పార్టీ నాయకుల లోపంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. సోము వీర్రాజు, కన్నా లక్ష్మీ నారాయణ, జీవీల్, తెలుగుదేశం నుండి వచ్చిన రాజ్యసభ సభ్యులు మినహా చెప్పుకోవడానికి వేరే లీడర్లు ఎవరూ లేరు. సరే.. ఉన్నవాళ్ళైనా ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడితే గెలవగలరా అంటే అది జరిగే పని కాదు. అందుకే గెలుపు గుర్రాల్ని వెతికే పని స్టార్ట్ చేసింది. శ్రీకాకుళం నుని కిమిడి కళా వెంకట్రావు, విజయవాడ నుండి కేశినేని నాని, గుంటూరు నుండి మోడుగులే వేణుగోపాల్ రెడ్డి, నెల్లూరు నుండి ఆనం ఇలా పలువురు కీలక నేతల మీద కన్నేసింది. వారితో లాబీయింగ్ కూడ చేసినట్టు చెబుతుంటారు. పదవులు లేక, అధికార పార్టీ దూకుడును తట్టుకోలేక ఇబ్బందులుపడుతున్నవారే వీరి టార్గెట్.
కేంద్రంలో అధికారంలో ఉన్నామని, రాజకీయాలే కాకుండా ఇతరత్రా విషయాల్లో కూడ సపోర్ట్ ఉంటుందని చెబుతూ కాస్తో కూస్తో పేరున్న నాయకుల్ని వలలో వేసుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ ప్రయత్నాలకు ఎవరూ పడుతున్నట్టు లేరు. టీడీపీ రాజ్యసభ సభ్యులు తప్ప చెప్పుకోదగిన ళీదళ్రు ఎవరూ బీజేపీ కండువా కప్పుకోలేదు. జిల్లాల వారీగా వెతుకులాట మొదలుపెట్టిన బీజేపీ ప్రస్తుతం గుంటూరు మీద కన్నేసింది. గతంలో ఈ జిల్లా నుండి వైసీపీ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని కదిలించి చూశారు. ఆయన పార్టీ మీద అసంతృప్తితో ఉన్న మాట నిజమే కానీ బీజేపీలోకి వెళ్లే యోచనలో అయితే లేరు. బీజేపీ ఆఫర్ ను ఆయన గట్టిగానే తిరస్కరించారు.
ఇక ఇప్పుడు ఇదే జిల్లా నుండి వైసీపీ నేత మక్కెన మల్లిఖార్జునరావును దువ్వుతున్నారు. మల్లిఖార్జునరావు గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ వైసీపీలో ఆయనకు కనీసం టికెట్ కూడ దొరకలేదు. అయినా పార్టీ కోసం ఆయన గట్టిగానే పనిచేశారు. గత ఎన్నికల్లో గుంటూరులో పార్టీ కోసం విశేషంగా పనిచేశారు. అప్పటికీ గుర్తింపు దొరకలేదు. పార్టీలో ఏ పదవీ దక్కలేదు. ఎందుకంటే ఈయనకు కాస్తో కూస్తో కేడర్ ఉన్నా కూడ గెలుపోటములను డిసైడ్ చేయగల శక్తి అయితే లేదు. అందుకే వైసీపీ అధిష్టానం లైట్ తీసుకుంది. ఇక సత్తెనపల్లి నేత యర్రం వెంకటేశ్వరరెడ్డి మీద కూడ బీజేపీ ఆసక్తిగా ఉంది. ఈయన గతంలో రెండు పర్యాయాలు కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా చేశారు. ఆయనకు వైసీపీతో, టీడీపీతో అస్సలు పొసగదు. అందుకే ఆయన్ను అక్కున చేర్చుకోవాలని చూస్తున్నారు. వాస్తవంగా ఆలోచిస్తే ఈయన కూడ సత్తెనపల్లిలో ఏమంత ప్రభావకారి కాదు. మాజీ ఎమ్మెల్యే అనే పేరే తప్ప బలమైన కేడర్ లేదు. మరి ఇలాంటి లీడర్లను చేర్చుకుని బీజేపీ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తామని అంటుండటం నిజంగా హాస్యాస్పదమే.