సంచలనం : ఎంఎల్ఏ పదవికి రాజీనామా..నిరాహార దీక్ష చేస్తా

చంద్రబాబునాయుడు పరిపాలనను నిరసిస్తూ మాజీ మంత్రి, తాడేపల్లి గూడెం ఎంఎల్ఏ, బిజెపి నేత పైడికొండల మాణిక్యాలరావు ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేశారు. పైడికొండల రాజీనామా చేసిన విషయం ప్రకటించగానే గోదావరి జిల్లాలో సంచలనంమైంది. తెలుగుదేశం ప్రభుత్వం తీరుకు నిరసనగానే తాను రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి ప్రకటించటం గమనార్హం. చంద్రబాబునాయుడు విధానాలకు నిరసనగానే గడచిన ఏడాది కాలంగా అసెంబ్లీ సమావేశాలను వైసిపి ఎంఎల్ఏలు బహిష్కరించిన సంగతి అందరికీ తెలిసిందే. వారితో తాజాగా బిజెపి ఎంఎల్ఏ పైడికొండల కూడా జాయినయ్యారు.

 

పోయిన ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చటంలో ప్రభుత్వం విఫలమైందంటూ మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధికి ఇచ్చిన సుమారు 56 హామీలను నెరవేర్చలేకపోయినందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు తన రాజీనామా లేఖలో చెప్పారు. అప్పట్లో ఇచ్చిన హామీలు ఏంటో కూడా పైడికొండల లేఖలో ప్రస్తావించారు. తన రాజీనామా లేఖను చూసిన 15 రోజుల్లోగా చంద్రబాబు స్పందించాలని కూడా అల్టిమేటమ్ హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికి తాను చంద్రబాబు చుట్టూ మూడు నెలలుగా తిరుగుతున్నా పట్టించుకోవటం లేదట పాపం.

 

చంద్రబాబు చుట్టూ ఎంతకాలం తిరిగినా ఉపయోగం ఉండదని అర్ధమైన తర్వాతే రాజీనామా చేసినట్లు చెప్పారు లేండి. 15 రోజుల్లో చంద్రబాబు స్పందించకపోతే 16వ రోజు నుండి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని కూడా పైడికొండల తీవ్రంగానే హెచ్చరించారు. అయినా నిరాహారదీక్షలకు దిగొచ్చే ప్రభుత్వమేనా ఇది ? ఏంటో నాలుగేళ్ళు మంత్రివర్గంలో కలిసున్నా పైడికొండలకు చంద్రబాబు పనితీరు అర్ధం కాలేదంటే ఆశ్చర్యంగానే ఉంది. నియోజకవర్గంలో టిడిపి లేదుకాబట్టే అభివృద్ధిలో పట్టించుకోలేదని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి కార్యక్రమాల అమలుకు అవసరమైతే తనను అడ్డు తొలగించినా పర్వాలేదంటూ చంద్రబాబుకు బంపర్ ఆఫరే ఇచ్చారు. మరి  చంద్రబాబు ఏమి చేస్తారో చూడాలి.