అవును ఈ మాట అన్నది ఎవరో కాదు బిజెపి శాసనసభాపక్ష నేత విష్ణకుమార్ రాజు. ఒకపుడు తనతో పెట్టుకుంటే ఎవరైనా ఫినిషే అంటూ చంద్రబాబునాయుడే తన గురించి తాను చెప్పుకున్నారు. కానీ ఇపుడు చెప్పింది బిజెపి ఎంఎల్ఏ. చంద్రబాబు ఏ ఉద్దేశ్యంతో చెప్పినా విష్ణు చెప్పింది మాత్రం అక్షరాల నిజమే అనిపిస్తోంది. మామూలుగా అయితే ఒక దెబ్బకు రెండు పిట్టలనటం చూసిందే కానీ చంద్రబాబు మాత్రం మూడు పిట్టలను కొట్టవచ్చని నిరూపించారని ఎద్దేవా చేశారు.
పోయిన ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్న చంద్రబాబు బిజెపిని కోలుకోనీయకుండా దెబ్బకొట్టిన విషయాన్ని గుర్తుచేశారు. మొన్నటి తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీని కూడా దెబ్బకొట్టిన విషయాన్ని ప్రస్తావించారు. అదే సమయంలో కాంగ్రెస్ తో కలిసినందు వల్ల టిడిపి కూడా దెబ్బతిన్న విషయాన్ని గుర్తుచేశారు. పొత్తు పెట్టుకోకముందు బలంగా కనిపించిన కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుతో పొత్తు వల్ల చివరకు కుదేలైన విషయాన్ని ప్రస్తావించారు. తెలంగాణాలో వేలు పెట్టిన చంద్రబాబు బిజెపిని కూడా దెబ్బకొట్టారన్నారు.
చంద్రబాబు కొట్టిన దెబ్బకు వచ్చే ఎన్నికల్లో ఏపిలో బిజెపితో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా ? అంటూ ఎదురుప్రశ్నించటం ఆశ్చర్యంగా ఉంది. నాలుగేళ్ళ పొత్తులతో బిజెపిని ఎక్కడ కూడా సొంతంగా ఎదగనీయకుండా చంద్రబాబు చేసినట్లు మండిపడ్డారు. పోయిన ఎన్నికల్లో బిజెపి, పవన్ కల్యాణ్ తో పొత్తులు పెట్టుకున్నందు వల్లే చంద్రబాబు అధికారంలోకి రాగలిగిన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవలన్నారు. కాకపోతే తమతో పొత్తులు పెట్టుకున్న చంద్రబాబు తమిద్దరినీ దెబ్బకొట్టి తాను మాత్రమే బలపడ్డారంటూ ఎద్దేవా చేశారు.