ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అన్ని రాజకీయ పార్టీలు కూడా కప్పల తక్కెడలా మారుతుంటాయి. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు జంప్ చేస్తుంటారు. కొన్ని సార్లు వారి అంచనా ఫలిస్తుంటాయి. కొన్ని సందర్బాల్లో బోల్తా కొట్టేస్తుంటాయి. అలా బోల్తా కొట్టిన నాయకులు గానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు గానీ అధికార పార్టీ పంచన చేరడం.. 2014 ఎన్నికల్లో హైలైట్. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది.
ప్రత్యేకించి- కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో. ఈ రెండు జిల్లాల్లో ఉన్న బీజేపీ క్యాడర్.. తమ సామాజిక వర్గానికే చెందిన పవన్ కల్యాణ్ వైపు దృష్టి సారించారు. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ తరువాత ఆయన జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఆయన ఒక్కరే కాదు గానీ, ఇంకా చాలామంది పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులంతా జనసేన వైపే చూస్తున్నారట. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న పాపానికి బీజేపీ తగిన ఫలితాన్ని అనుభవిస్తోందనడంలో సందేహాలు అక్కర్లేదు. రాష్ట్రంలో బలం పుంజుకోబోతున్న ప్రతీసారి..చంద్రబాబు రూపంలో అడ్డంకులు ఏర్పడుతూనే వచ్చాయి. ఇదీ కాదనలేనిదే.
1999లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ఛరిష్మాతో ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ ఓ వెలుగు వెలిగింది. గ్రామస్థాయిలో క్యాడర్‌ను బలంగా నిర్మించుకోగలిగింది. అదే సమయంలో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ఒంటరిగా పోటీ చేసే అవకాశాలను పోగొట్టుకుంది. 2004లోనూ అదే పరిస్థితి. ఈ సారి కూడా నరేంద్ర మోడీ మ్యాజిక్‌తో ఓ స్థాయికి చేరుకున్నప్పటికీ.. మళ్లీ చంద్రబాబే అడ్డు పడ్డారు.
ఫలానా అని కాకుండా తన వైఫల్యాలన్నింటినీ బీజేపీ మీద నెట్టేస్తున్నారు చంద్రబాబు. నాలుగేళ్ల పాటు మోడీని పొగిడిన చంద్రబాబు- పోలవరం లెక్కలు అడిగిన వెంటనే కేంద్రంతో తెగదెంపులు చేసుకోవడం కమలనాథులకు హైఓల్టేజ్ షాక్ కొట్టినట్టయింది. అక్కడితో ఆగరా? లేదే. ప్రతి విషయంలోనూ మోడీని తప్పుపడుతున్నారు. `మీ మోడీ ఏ చేశారంటూ రంకెలు వేస్తున్నారు.
బీజేపీ సానుభూతి పరులతో పాటు తటస్థంగా ఉన్న ఓటు బ్యాంకును బీజేపీకి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. విభజన హామీలు నెరవేర్చలేదంటూ, హోదా ఇవ్వలేదంటూ మోడీపై దుమ్మెత్తి పోస్తున్నారు. చంద్రబాబు దెబ్బకు మరో పదేళ్లయినా కోలుకోలేని పరిస్థితి కమలనాథులది. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లడంలో దారుణంగా విఫలమైంది. ఈ క్రమంలో- బీజేపీ క్యాడర్‌కు ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీ కనిపిస్తోంది. నాలుగు కాలాల పాటు రాజకీయాల్లో కొనసాగాలంటే బీజేపీని వీడని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు కార్యకర్తలు, నాయకులు.
దీనితో- ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున బీజేపీ క్యాడర్ పవన్ పార్టీలోకి చేరడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది అక్కడితో ఆగేలా లేదు. జనసేన పార్టీ కాస్తో, కూస్తో బలంగా ఉన్న జిల్లాల్లో బీజేపీ క్యాడర్ పవన్ వైపే చూస్తున్నారు. సంక్రాంతి తరువాత ఆయన మొదలు పెట్టే జిల్లా పర్యటనలు, పాదయాత్ర సందర్భంగా పెద్ద ఎత్తున చేరికలు ఉండొచ్చని అంటున్నారు.