రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, ఆయన భార్య ఆకుల లక్ష్మీ పద్మావతి సోమవారం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.
విజయవాడలోని పరిణయ కళ్యాణ వేదికలో వేలాది మంది అనుచరులతో కలసి జనసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్ గ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఆకుల సత్యనారాయణ, శ్రీమతి లక్ష్మీ పద్మావతిలకు పార్టీ అధినేత కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
2014 ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆకుల సత్యనారాయణ, జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న తర్వాత తన శాసనసభ్యత్వానికీ, భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. అంతకుముందు ఆకుల సత్యనారాయణ దాదాపు 300 కార్లు, వెయ్యి మంది జనసేన కార్యకర్తలు అభిమానులతో కలసి భారీ ర్యాలీగా విజయవాడకి తరలివచ్చారని జనసేన పార్టీ తెలిపింది.
తూర్పుగోదావరి జిల్లాలో ఆకుల సత్యనారాయణ కుటుంబానికి ప్రత్యేక గౌరవం ఉందని, అలాంటి కుటుంబం జనసేనలో చేరడం వల్ల పార్టీ మరింత బలోపేతం అయ్యిందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. 2014 ఎన్నికల పొత్తులో భాగంగా ఆకుల సత్యనారాయణకు మద్దతు ఇచ్చానని, వారి కుటుంబానికి పార్టీ అండగా ఉండి ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఆకుల సత్యనారాయణ దంపతులను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు పవన్‌కళ్యాణ్ తెలిపారు.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే తాను అక్కడి నుంచి పోటీ చేస్తానని, రాజకీయ వ్యవస్థను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రక్షాళన చేస్తారనే నమ్మకం తనకు ఉందని రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ఆకుల సత్యనారాయణ తెలిపారు. సంక్షేమ పథకాల్లో అవినీతి రాజ్యమేలుతుందని, అవినీతికి తావులేని పరిపాలన శ్రీ పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యమన్నారు. స్వార్థ రాజకీయాలు, ఓటు బ్యాంకు కోసం కొంతమంది నాయకులు కులాల మధ్య అంతరాలు పెంచుతున్నారని, ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆలోచిస్తున్నారని, సమర్థమైన, పారదర్శకమైన పాలన జనసేనతోనే సాధ్యమని నమ్మి పార్టీలో చేరానన్నారు.
నరసాపురం నియోజకవర్గం నుంచి చేరికలు
అంతకు ముందు పార్టీ కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గానికి చెందిన మత్స్యకార సంఘం నాయకుడు శ్రీ బొమ్మిడి నాయకర్ తన అనుచరులతో కలసి జనసేన పార్టీలో చేరారు. పవన్‌కళ్యాణ్ కండువా కప్పి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు. ఉభయగోదావరి జిల్లాల అగ్నికుల క్షత్రియ సంఘం ఇన్‌ఛార్జ్‌గా ఉన్న నాయకర్ 2009 నుంచి నరసాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు. (ఫీచర్ ఫోటో కర్టసీ జనసేన పార్టీ)