ఉంటే ఉంటాడు: పవన్ విషయంలో బీజేపీ లైట్!

ఏపీలో బీజేపీ – జనసేనలో పొత్తులో ఉన్నాయనేది అధికారికంగా వినిపించే మాట. కానీ… రాజకీయంగా ఓనమాలు దిద్దడం రానివారు సైతం ఈ విషయాన్ని అంగీకరించరు. జనసేనతో బీజేపీ బలవంత కాపురం చేస్తుంటే… బీజేపీతో పవన్ ఇష్టం లేని కాపురం చేస్తున్నారని అంటుంటారు. ఈ పరిస్థితుల్లో చూశారు చూశారు.. ఇంక ఓపిక నశించిందో ఏమో కానీ… పవన్ విషయంలో… “ఉంటే ఉంటాడు – పోతే పోతాడు” అనే స్థాయి విరక్తికి వచ్చేశారంట ఏపీ బీజేపీ నేతలు. దీంతో… ఇకపై ఒంటరిగానే ప్రయత్నాలు చేసుకోవాలని – ఉన్నంతలో కష్టపడి నాలుగు ఓట్లు రాబట్టుకోవాలని భావిస్తున్నారంట.

అవును.. పవన్ చూపు నిత్యం టీడీపీ వైపు ఉండటంతో… ఆయన మావాడే అని పైకి చెప్పుకుంటూ.. ఎంతకాలం ఈ ఆత్మవంచన అన్న సృహ ఏపీ బీజేపీ నేతలలో బయల్దేరిందంట. అందులో భాగంగా… ఉత్తరాంధ్రా మాజీ ఎమ్మెల్సీ పీవీన్ మాధవ్… “పొత్తు ఉందా లేదా అన్నది అర్ధం కావడం లేదు.. పొత్తు ఉంటే తాము అడిగినప్పుడైనా పవన్ మద్దతు ఇవ్వాలి కదా” అంటూ తన బాధను చెప్పేశారు. ఇక సోము వీర్రాజైతే… “కేంద్రంలో మోడీ పాలన బాగుందని, ఆయనతో మంచి రిలేషన్స్ ఉన్నాయని చెప్పుకుంటున్న వారు.. ఏపీలో బీజేపీని ఎదగనీయకుండా చేస్తున్నారు” అంటూ నర్మగర్భంగా కామెంట్ చేశారు.

దీంతో… పవన్ విషయంలో ఏపీ బీజేపీ నేతలు లైట్ తీసుకున్నారని తెలుస్తుంది. అవును… జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సంబంధం లేకుండా పార్టీ కార్యక్రమాలు చూసుకోవాలని స్పష్టమైన మెసేజ్ హస్తిన నుంచి ఏపీ బీజేపీ నేతలకు అందినట్లు విశ్వసనీయ సమాచారం. “తనకు కేంద్ర నాయకులతో ఎలాంటి ఇబ్బందులు లేవు, సమస్యెల్లా రాష్ట్ర నేతలతో” అని పవన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. “చలో అమరావతి” కార్యక్రమాన్ని వాయిదా వేయించింది, గ్రేటర్ హైదరాబాద్ “బల్దియా” ఎన్నికల్లో పోటీచేస్తానంటే ఆంధ్రోడివని అంగీకరించనిది స్థానిక నేతలే.. అని పవన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రనాయకత్వం సీరియస్ గా ఉందని తెలుస్తుంది.

ఈ సందర్భంగా… ఒకరి బ్లాక్ మెయిల్ కు, ఒకరి వ్యూహాలకు భయపడాల్సిన పనిలేదని, బలవ్వాల్సిన పని అస్సలు లేదని.. సొంతంగా ఎదిగేందుకే ప్రయత్నాలు చేయండి అని బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ఢిల్లీ కాషాయ పెద్దలు సూచించినట్లు తెలిసింది. టీడీపీతో బీజేపీని కలపాలని పవన్ తాపత్రయ పడుతున్నారని.. అసలు టిడీపీ తరుపున వంత పాడటానికే పవన్ బీజేపీతో జతకట్టారేమో అని కొందరు బీజేపీ నేతలు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారంట. పరిస్థితి ఇంత సీరియస్ గా ఉండటంతో… పవన్ కు గుడ్ బై చెప్పేయనున్నారంట బీజేపీ నేతలు. సో… తొందర్లో పవన్ ఫ్రీ బర్డ్ అయిపోతారన్నమాట!