ఫిరాయింపులపై చంద్రబాబును నిలదీసిన బిజెపి

అసెంబ్లీ సమావేశాల్లో ఫిరాయంపు ఎంఎల్ఏల అంశంపై తెలుగుదేశంపార్టీ ఇరుకునపడింది. ముగ్గురు ఎంఎల్ఏలు రావెల కిషోర్ బాబు, మేడా మల్లికార్జున రెడ్డి, ఆకుల సత్యనారాయణ చేసిన రాజీనామాలను ఆమోదించినట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీలో ప్రకటించారు. అదే విషయమై బిజెపి శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, ముగ్గురు ఎంఎల్ఏల రాజీనామాలను ఆమోదించినపుడు ఫిరాయింపు ఎంఎల్ఏలు చేసిన రాజీనామాలను మాత్రం ఎందుకు ఆమోదించలేదంటూ స్పీకర్ ను ఉద్దేశించి సూటిగా ప్రశ్నించారు. ముగ్గురు ఎంఎల్ఏల రాజీనామాలను ఆమోదించటంలో చూపిన తొందరను ఫిరాయింపు ఎంఎల్ఏల రాజీనామాలను ఆమోదించటంలో ఎందుకు చూపలేదని విష్ణు అడిగిన ప్రశ్నతో స్పీకర్, చంద్రబబు అండ్ కో ఇబ్బంది పడ్డారు.

దాంతో ఏ విషయం మీదైనా అడ్డంగా మాట్లాడే అలవాటున్న మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకున్నారు. బిజెపి ఎంఎల్ఏ ఆకుల సత్యనారాయణ పార్టీకి ఎందుకు రాజీనామా చేశారో ముందు విష్ణు చెప్పాలంటూ అడ్డం మాట్లాడారు. నిజానికి ఫిరాయింపుల రాజీనామాలు ఆమోదించకుండా పెండింగులో పెట్టటానికి బిజెపి ఎంఎల్ఏ పార్టీని వీడటానికి ఏమి సంబంధం ? అచ్చెన్న ఎప్పుడు మాట్లాడినా కనీసం విజ్ఞత కూడా లేకుండానే మాట్లాడుతుంటారు. అందుకనే ఇఫుడు కూడా చంద్రబాబు అచ్చెన్నననే ప్రయోగించారు. దాంతో విష్ణు ఎదురుతిరిగి టిడిపి ఎంఎల్ఏ మేడా మల్లికార్జునరెడ్డి పార్టీకి ఎందుకు రాజీనామా చేశారో చెబితే తర్వాత బిజెపి ఎంఎల్ఏ రాజీనామా అంశాన్ని మాట్లాడుదామంటూ చెప్పారు.

నిజానికి రాజీనామాలు చేసిన ముగ్గురు ఎంఎల్ఏల్లో రావెల, మేడా టిడిపి సభ్యులే. వారిద్దరిలో ఒకరు జనసేనలోకి మరొకరు వైసిపిలోకి వెళ్ళారు కాబట్టే స్పీకర్ వారి రాజీనామాలను వెంటనే ఆమోదించేశారు. స్పీకర్ ఆమోదించారు అనేకన్నా చంద్రబాబు ఆదేశాలను పాటించారంటే బాగుంటుంది. ఇద్దరు ఎంఎల్ఏలు టిడిపి వదిలిపెట్టారు కాబట్టి ప్రతిపక్షాల బలం పెరగకుండా వెంటనే రాజీనామాలను ఆమోదించారు.

అదే ఫిరాయింపుల విషయానికి వస్తే వారిని చేర్చుకోవటం వల్ల టిడిపి బలం పెరిగింది. వారు చేసిన రాజీనామాలను ఆమోదిస్తే టిడిపి బలం ఆమేరకు పడిపోతుంది. అందుకే చంద్రబాబు ఆదేశించలేదు, స్పీకర్ ఆమోదించలేదన్నది వాస్తవం. అంటే టిడిపిలో చేర్చుకునే ఎంఎల్ఏల విషయంలో ఒకలాగ, టిడిపిని వదిలేసిన వారి విషయంలో మరొకలాగ చంద్రబాబు, స్పీకర్ వ్యవహరిస్తున్నారు. ఆ విషయం బయటపడుతోందనే విష్ణు మాటలపై చర్చ జరగకుండా అచ్చెన్న అడ్డం పడ్డారు.