రాజకీయాలకు మెగాస్టార్ చిరంజీవికి దూరం చాలా పెరిగిపోయింది. అంటిన ఆ బురదను వదిలించుకోవడానికి ఆయనకు ఏడెనిమిదేళ్లు పట్టింది. ఏనాడూ ఎవ్వరి చేత ఒక్క మాట పడి ఎరుగని చిరు రాజకీయాల మూలంగా చిన్న చిన్న వ్యక్తుల విమర్శలకు కూడ గురికావాల్సి వచ్చింది. అది ఆయన్ను ఎంతో వేదనకు గురిచేసింది. ప్రజారాజ్యం ఎపిసోడ్ కారణంగా మెగా ఫ్యామిలీ సీన్ సగానికి పడిపోయింది. తిరిగి సినిమాల్లోకి అడుగుపెట్టాక గానీ చిరుకు సంతోషం దొరకలేదు. ఇప్పుడు ఆయన పనేదో ఆయన చూసుకుంటున్నారు. రాజకీయాల ప్రస్తావన లేదు. అంతా సవ్యంగానే నడుస్తోంది. కానీ బీజేపీ రూపంలో ముసలం మొదలయ్యేలా ఉంది. బీజేపీ తాన్ రాజకీయం కోసం మెగా ఫ్యామిలీని వాడుకుంటున్నట్టు కనిపిస్తోంది.
ఏపీలో బలపడాలనే దృఢ సంకల్పంతో ఉన్న బీజేపీ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేనతో పొత్తు పెట్టుకుంది. అదేమంత ఫలప్రదంగా లేదు. అటుతిరిగి ఇటు తిరిగి జనసేనకు నష్టం వాటిల్లుతోంది. పవన్ అభిమానులు బీజేపీతో దోస్తీని అస్సలు సహించలేకున్నారు. ఇది చాలదన్నట్టు కొత్తగా బీజేపీ చిరంజీవిని రాజకీయాల్లోకి లాక్కురావాలని చూస్తోంది. కాపు ఓటర్లకు ఒక బలమైన నాయకత్వం అంటూ ఉంటే వైసీపీ, టీడీపీల నుండి ఆ ఓటు బ్యాంకును దూరం చేయవచ్చనేది బీజేపీ ఆలోచన. ఆ ఓటు బ్యాంకును మొత్తంగా కొల్లగొట్టాలంటే పవన్, చిరులను కలిపి తమ జట్టులో పెట్టుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే పవన్ పొత్తులో ఉండగా చిరును కూడ తమకు జైకొట్టేలా చేయాలని చూస్తున్నారు.
సోము వీర్రాజు అధ్యక్షుడు అయిన వెంటనే చిరంజీవిని కలిశారు. పరోక్షంగా మద్దతు కోరుతున్నట్టే మాట్లాడారు. ఇప్పుడేమో తమ్ముడు పవన్ కు చిరు మద్దతు అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఒకవేళ చిరు గనుక మళ్ళీ రాజకీయం అంటూ బయటికొచ్చి తమ్ముడి కోసం పనిచేస్తే జనం అస్సలు ఒప్పుకోరు. కాపు వర్గమే నమ్మకపోవచ్చు. అంత నమ్మేవాళ్లే అయితే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యానికి 2019 ఎలక్షన్లలో జనసేనకు ఓట్లు వేసేవారు. కానీ వేయలేదు. అలాంటిది విఫలమైన చరిత్ర ఉన్న చిరు ఇప్పుడొచ్చి తమ్ముడితో కలుస్తాను అంటే నమ్మేస్తారా. పైపెచ్చు ఇదేదో కొత్త డ్రామాలా ఉందని ఇంకాస్త గట్టిగా తిరస్కరిస్తారు. అప్పుడు అరకొరగా అయినా రాజకీయాల్లో నెట్టుకొస్తున్న మెగా ఫ్యామిలీ అడ్రెస్ ఈసారి పూర్తిగా గల్లంతైపోతుంది.