భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాల్లో పటిష్టం కావడం కోసం శతవిధాలా ప్రయత్నిస్తోంది. బలపడటానికి ఎన్ని దారులున్నాయో అన్నిటినీ తొక్కుతోంది. ఈ ప్రాసెస్లో తెలంగాణలో సక్సెస్ అయింది కూడ. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటిన కమలం సార్వత్రిక ఎన్నికలకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటోంది. ఇందులో మొదటి అడుగుగా ప్రత్యర్థి పార్టీల నుండి నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ నుండి విజయశాంతిని పార్టీలో చేర్చుకుని ఇంకొందరి మీద గుర్తిపెట్టి ఉంది. ఇదే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ నందు కూడ చేస్తోంది. సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడు అయిన వెంటనే ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఎలాంటి ఎరలు వేస్తే పెద్ద చేపలు పడుతాయన్నది ప్లాన్ చేసి పెట్టుకున్నారు.
ప్రధానంగా త్వరలో పాలన రాజధానిగా మారనున్న విశాఖపట్నం మీద దృష్టి పెట్టారు వీర్రాజు. ఇక్కడ బలమైన నేతలు లేకపోతే భవిష్యత్తులో నెగ్గుకురావడం చాలా కష్టమవుతుంది. అందుకే మంచి బలమైన నేతల దగ్గరనుండి ఒక మోస్తారు ప్రజాదరణ ఉన్న నాయకుల వరకు ఎవ్వరినీ వదలట్లేదు. ఎవరైనా సొంత పార్టీల మీద అసంతృప్తితో ఉన్నారని తెలియగానే రాయబారాలు పంపుతున్నారు. ఈ రాయబారాల్లో ప్రధానంగా ఒక ఆఫర్ ఇస్తున్నారట. అదే విశాఖ ఎంపీ సీటు. తమ పార్టీలో చేరితే వచ్చే ఎన్నికల్లో విశాఖ లోక్ సభ స్థానం నుండి టికెట్ ఇస్తామని చెబుతున్నారట. అయితే ఈ మాట ఒక్కరికి చెబితే పర్వాలేదు. కానీ చేర్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇదే మాట చెబుతున్నారట.
విశాఖలో కీలకమైన నేతగా ఉన్న గంటా శ్రీనివాసరావు తెలుగుదేశాన్ని వీడే పనిలో ఉన్నారు. వైసీపీలో చేరాలనేది ఆయన ఉద్దేశ్యం. అయితే ఆ చేరిక అధికారికంగా ఉండాలని, మంత్రి పదవి మీద గ్యారెంటీ కావాలని గంటా అడుగుతున్నారట. పైగా వైసీపీలోనే ఆయనకు మోకాలడ్డుతున్న లీడర్లు చాలామందే ఉన్నారు . అందుకే కొన్ని నెలల నుండి ఆయన కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్లో ఉండగానే ఆయన మీద కర్చీఫ్ వేసింది కమల దళం. వైసీపీలోకి వెళ్లకుండా బీజేపీలో చేరితే భద్రతతో పాటు విశాఖ ఎంపీ టికెట్ ఇస్తామని చెబుతున్న్నారట. బలం, బలగం రీత్యా ఆ ఎంపీ స్థానాన్ని గెలవగలిగే సామర్థ్యం గంటాకు ఉన్నాయనే చెప్పాలి. అందుకే ఆయన కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు.
అలాగే ఇటీవలే జనసేన నుండి పక్కకు వచ్చేసిన వివి.లక్ష్మీనారాయణకు కూడ అదే సీటును ఆశజూపుతున్నారట. గత ఎన్నికల్లో లక్ష్మీనారాయణ గెలవకపోయినా 2.8 లక్షల ఓట్లు తెచ్చుకున్నారు. కాస్త కష్టపడితే ఆయన్ను గెలిపించుకోవచ్చని అనుకుంటున్నారు వీర్రాజు. గతంలో ఈ స్థానం నుండి బీజేపీ తరపున కంభంపాటి హరిబాబు ఎంపీగా గెలిచి ఉన్నారు. అందుకే బీజేపీ అంత ధీమాగా ఆ స్థానం నుండి గెలిపించుకుంటామని ఆఫర్ ఇస్తోంది. ఒకవేళ ఈ ఆఫర్ కు పడిపోయి ఇద్దరు ముగ్గురు నేతలు బీజేపీలోకి వెళితే రేపు ఎన్నికల రోజున టికెట్ దక్కించుకోవడం కోసం తన్నుకోవాల్సి ఉంటుందో. మరి ఆ గొడవలకు హూ ఈజ్ రెస్పాన్సిబిలిటీ అనేది కూడ బీజేపీ చెప్పాల్సి ఉంటుంది.