పవన్ అడిగిన రోడ్ మ్యాప్ పై సంచలన కామెంట్స్ చేసిన సునీల్!

కొన్ని నెలల క్రితం ఎప్పుడో పవన్ ఒక మాట చెప్పారు. బీజేపీని రోడ్ మ్యాప్ అడిగాను.. వాళ్లింకా ఇవ్వలేదు. వారివ్వడమే ఆలస్యం.. తర్వాత మామూలుగా ఉండదు అని! అయితే… పవన్ కు రోడ్ మ్యాప్ ఇచ్చేశాం అని బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. దీంతో… వీరిద్దరిమధ్యా స్నేహం బీటలు వారిందిలే.. ఇప్పుడు ఇలానే ఉంటారు.. అంటూ చర్చలు నడిచాయి. అయితే… తాజాగా ఈ రోడ్ మ్యాప్ పై ఆసక్తికర కామెంట్లు చేశారు ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ డియోధర్!

అవును… తాజాగా పవన్ అడిగిన రోడ్ మ్యాప్ పై స్పందించిన ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ డియోధర్… పవన్ కు రోడ్ మ్యాప్ ఎప్పుడో ఇచ్చేశాం.. ఇకపై రోడ్ మ్యాప్ కి సంబంధించిన ప్రశ్నలు ఏవైనా పవన్ కే వేయాలి తప్ప.. తమని కాదని బదులిచ్చారు. ఇదే సమయంలో… ఏపీలో బీజేపీ పుంజుకుంటోందని, మూడేళ్ల పాటు ఉమ్మడి ఏపీని ఏలిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తమ పార్టీలో చేరారని, దాంతో ఏపీలో పటిష్టం అయ్యామని చెబుతున్నారు.

దీంతో… జనసేన మిత్ర బంధం ఉన్నా లేకపోయినా.. తమకు ఏపీలో బలం పెరుగుతోందని సునీల్ డియోధర్ భావిస్తున్నారా అనే చర్చ తెరపైకి వచ్చింది. ఇక్కడ క్లియర్ గా ఉన్న అంశం ఏమిటంటే… బీజేపీ నేతలకు రాబోయే ఎన్నికల్లో జనసేనతో కలిసి వెళ్లాలి, హిందుత్వం తో పాటు కాపు సామాజిక ఓట్లను లక్ష్యంగా చేసుకుని ముందుకుసాగాలని ఉంది. సోము వీర్రాజు కూడా కాపు సామాజికవర్గం వారే కాబట్టి… కాపులకు బీజేపీ పెద్ద పీట వేస్తుందని చెప్పుకునే ప్రయత్నం చేయాలని ఉంది.

కానీ… పవన్ మనసంతా చంద్రబాబుపైనే ఉంది! దీంతో పవన్… టీడీపీ – బీజేపీ – జనసేన కలిసి వేళ్తే 2014 ఫలితాలు వస్తాయని ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. కానీ… ఆ కూటమికి బీజేపీ ససేమిరా అంటుంది! చంద్రబాబుతో కలిసి నడిచే ప్రసక్తి లేదని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది! ఇది ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న మూడుముక్కలాట! దీంతో… పవన్ కు బీజేపీకి గ్యాప్ వచ్చిందని.. ఎన్నికలు సమీపించేనాటికి ఇది మరింతగా పెరుగుతుందని అంటున్నారు విశ్లేషకులు!

అయితే… పవన్ కూడా అప్పుడే బీజేపీతో కటీఫ్ చెప్పలేని పరిస్థితి. కారణం… తమకు ఇచ్చే సీట్ల విషయంలో టీడీపీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అక్కడ స్పష్టత రాకుండా ఇక్కడ బీజేపీతో కటిఫ్ చెప్పేస్తే… రెంటికీ చెడ్డ రేవటి లా అయిపోతుందని పవన్ ఆలోచనగా ఉందని చెబుతున్నారు. సో… బీజేపీ – జనసేనల బంధం బలం – బలహీనతలు ఇప్పుడు చంద్రబాబు చేతిలో ఉన్నాయన్నమాట! మరి ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో… వీరి పొత్తుల వ్యవహారం ఎంత తొందరగా ఫైనల్ అవుతుందనేది వేచి చూడాలి!