పవన్ కు పెద్ద షాక్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పెద్ద షాకే తగిలింది. పవన్ బంధువు, పార్టీ పెట్టినప్పటి నుండి కోశాధికారిగా పని  చేస్తున్న  మారిశెట్టి రాఘవయ్య రెండోసారి జనసేనకు రాజీనామా చేసేశారు. రెండోసారి అని ఎందుకు చెప్పాల్సొచ్చిందంటే ఎన్నికలకు ముందు కూడా ఒకసారి రాజీనామా చేశారు.  అప్పట్లో పార్టీకి రాజీనామా చేసిన మారిశెట్టి చెన్నై వెళ్ళిపోయారని పార్టీ వర్గాలు తెలిపాయి. పవన్ చుట్టూ ఉండే కోటరీ దెబ్బను తట్టుకోలేక మారిశెట్టి వెళ్ళిపోయారట. అయితే పవన్ పట్టుపట్టడంతో మారిశెట్టి మళ్ళీ పార్టీలోకి వచ్చారు.

మొన్నటి ఎన్నికల్లో కాకినాడ ఎంపిగా పోటీ చేద్దామని అనుకున్నారు. ఎంపిగా దరఖాస్తు కూడా చేసుకున్నారు. అయితే సదరు కోటరీతో ఏమాత్రం పొసగని కారణంగా టికెట్ కూడా దక్కలేదు. మారిశెట్టికి టికెట్ రాలేదని తెలిసి కూడా పవన్ నోరు మెదపలేదని సమాచారం. దాంతో మారిశెట్టికి ఒళ్ళు మండిపోయింది.

అయితే ఎన్నికలకు ముందు పార్టీకి రాజీనామా చేయటం ఇష్టం లేక చివరకు గురువారం జనసేన కోశాధికారిగానే కాకుండా ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేసి దణ్ణం పెట్టేశారు.  పార్టీ కోసం కష్టపడే వారిని కాదని కోటరీకే పవన్ ప్రాధాన్యత ఇవ్వటం కూడా రాఘవయ్యకు నచ్చలేదట. అదే విషయాన్ని చెప్పినా పవన్ పట్టించుకోలేదని పార్టీ వర్గాలు చెప్పాయి.

పార్టీని బలోపేతం చేసే విషయంలో స్వయంగా పవన్ కే దృష్టి లేనపుడు పార్టీలో ఉండి కూడా ఉపయోగం లేదన్న నిర్ణయానికి రాఘవయ్య వచ్చారని సమాచారం. ప్రజారాజ్యంపార్టీలో కూడా మారిశెట్టి కీలకంగా ఉన్న విషయం తెలిసిందే. అందుకే జనసేన ఆవిర్భావం  నుండి రాఘవయ్య పార్టీలో పనిచేశారు. సరే పార్టీలో ఎంతకాలం ఉన్నా కంచుగరుడ సేవ తప్ప ఇంకేమీ ఉపయోగం ఉండదని నిర్ధారణ అయిన తర్వాతే జనసేనకు రాజీనామా చేసేసినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.