తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై నమోదైన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఆయనకు ఊరట దక్కలేదు. చంద్రబాబు తరఫు దాఖలైన క్వాష్ పిటిషన్‌ని ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
ఈ కేసులో రిమాండ్ చెల్లదంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తన అరెస్టు అక్రమమనీ అందులో ఆయన పేర్కొన్నారు. మొత్తంగా ఎఫ్ఐఆర్‌ని క్వాష్ చేయాలని కూడా తన క్వాష్ పిటిషన్‌లో ప్రస్తావించారు చంద్రబాబు.
చంద్రబాబు తరఫున సిద్దార్ధ లూథ్రా, హరీష్ సాల్వే లాంటి సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. మరోపక్క, ఏపీ సీఐడీ తరఫున ముకుల్ రహోత్గీ, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తదితరులూ వాదనలు వినిపించారు. హైకోర్టు, సీఐడీ వాదనలతో ఏకీభవించిన దరిమిలా, చంద్రబాబు తరఫు న్యాయవాదుల తదుపరి వ్యూహమేంటన్నది తేలాల్సి వుంది.
కాస్సేపట్లో ఏసీబీ కోర్టులో మరో తీర్పు ఈ కేసుకు సంబంధించి రావాల్సి వుంది. అదే సమయంలో, సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు.
అసలు ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబనాయుడు వాపోతోంటే, ఈ కేసులో నిండా ఆయన కూరుకుపోయినట్లుగా సీఐడీ స్పష్టంగా చెబుతున్న సంగతి తెలిసిందే.
ప్రతిసారీ సీఐడీ వాదనలకు అనుకూలంగానే న్యాయస్థానాలు స్పందిస్తున్న దరిమిలా, ఈ కేసులో చంద్రబాబు పూర్తిగా కూరుకుపోయినట్లే భావించాలేమో.!