ఐపిఎస్ అధికారుల బదిలీ విషయంలో హైకోర్టు చంద్రబాబునాయుడుకు పెద్ద షాక్ ఇచ్చింది. ఐసిఎస్ అధికారుల బదిలీలో తాము జోక్యం చేసుకోమని కోర్టు స్పష్టంగా చెప్పేసింది. ఎన్నికల విధుల నుండి ఐబి ఛీఫ్ ఏబి వెంకటేశ్వరరావుతో పాటు మరో ఇద్దరు ఎస్పీలను బదిలీ చేస్తు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
అయితే, ఈసి ఆదేశాలను సవాలు చేస్తు చంద్రబాబు సర్కార్ కోర్టును ఆశ్రయించింది. ఐబి ఛీఫ్ ను బదిలీ చేసే అధికారం, పరిధి ఎన్నికల సంఘానికి లేదంటూ చంద్రబాబు అడ్డుగోలు వాదన మొదలుపెట్టారు. ఎన్నికల ప్రక్రియతో ఏమాత్రం సంబంధం లేని ఐబి ఛీఫ్ ను బదిలీ చేయాల్సిన అవసరం ఏమిటంటూ ఈసి అధికారాలనే ప్రశ్నిస్తు ప్రభుత్వం కోర్టులో కేసు వేసింది.
దాంతో అన్నీ వర్గాల్లో ఈ కేసు విషయంలో కోర్టు ఏం చేస్తుందనే సస్పెన్స్ మొదలైంది. అయితే తాజాగా కోర్టు చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు షాక్ ఇచ్చాయి. ఈసి ఆదేశాల విషయంలో తాము జోక్యం చేసుకునేది లేదని స్పష్టంగా చెప్పేసింది. ఎందుకంటే, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారుల జాబితాను ఇమ్మని ఈసి కోరింది. అందులో చాలామంది ఉన్నతాధికారులతో పాటు ఐబి ఛీఫ్ పేరు కూడా ఉంది. దాని ఆధారంగానే ఈసి నిర్ణయం తీసుకుంది. తీరా ఈసి ఐబి ఛీప్ ను బదిలీ చేయగానే చంద్రబాబు గగ్గోలు పెట్టేస్తున్నారు.