తండ్రి, కొడుకుల సవాల్ …జిల్లాలో ఇదే హాట్ టాపిక్

జిల్లాలో ఇపుడిదే హట్ టాపిక్ గా మారిపోయింది. తండ్రి ఒక పార్టీకి మద్దతుగా నిలబడితే, కొడుకు ఇంకోపార్టీకి ప్రచారం చేస్తున్నారు. మొన్నటి వరకూ తండ్రి కొడుకులు ఒకే పార్టీలో ఉన్నపుడు మద్దతుదారులకు ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఎప్పుడైతే తండ్రి, కొడుకులు పార్టీల వారీగా  విడిపోయారో అప్పటి నుండి మద్దతుదారుల్లో కూడా అయోమయం మొదలైపోయింది. ఇంతకీ ఇదంతా ఏ జిల్లాలో అనుకుంటున్నారా ? అదే నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరుపేట నియోజకవర్గంలోనే లేండి.

నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ అంటే ముందుగా గుర్తుకువచ్చేది  వేనాటి కుటుంబమే. అటువంటి కుటుంబం నుండి వేనాటి రామచంద్రరెడ్డి ప్రస్తుతం జిల్లా పరిఫత్ వైస్ ఛైర్మన్ గా ఉన్నారు. ఆయన కొడుకు వేనాటి సుమంత్ రెడ్డి సూళ్ళూరుపేట మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్. పార్టీలో ప్రధానంగా యూత్ లో బాగా చొచ్చుకుపోయారు. అటువంటిది పాదయాత్ర సందర్భంగా వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు. దాంతో టిడిపికి పెద్ద దెబ్బపడింది.

తమ కుటుంబానికి చంద్రబాబు సరైన గుర్తింపు ఇవ్వలేదన్న కారణంతో సుమంత్ రెడ్డి ఎప్పుడైతే వైసిపిలో చేరారో పార్టీకి సూళ్ళూరుపేటలో మంచి ఊపొచ్చింది. అప్పటి నుండి వైసిపి తరపునే నియోజకవర్గం మొత్తం పర్యటనలు చేసేస్తున్నారు. మంత్రి నారాయణపై ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు.  అయితే రామచంద్రారెడ్డి టిడిపికి మద్దతుగానే నిలబడినా వయస్సు రీత్యా చురుగా పనిచేయలేకున్నారు. దానికితోడు నియోజకవర్గంలో టిడిపి పరిస్ధితి రోజురోజుకు దిగజారిపోతుండటం మంత్రి నారాయణకు బాగా ఇబ్బందిగా తయారైంది.

మంత్రి ఆదేశాలతో రామచంద్రారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో టిడిపికి ప్రచారం మొదలుపెడితే, వేనాటి సొంత గ్రామం మావిళ్ళపాడులో సుమంత్ రెడ్డి వైసిపి ఎంఎల్ఏ కలివేటి సంజీవయ్య తదితరులతో భారీ కార్యక్రమం పెట్టి  వైసిపి ప్రచారం ప్రారంభించారు. వేనాటి కుటుంబం మొత్తం టిడిపిలో ఉన్నంత కాలం వైసిపి నేతలెవరూ మావిళ్ళపాడులో ప్రచారానికి కూడా వచ్చింది లేదు.

అటువంటిది సుమంత్ కారణంగా భారీ కార్యక్రమంతో ఇంటింటికి ప్రచారంతో చొచ్చుకుపోతోంది. సొంతన్న సతీష్ రెడ్డి సర్పంచ్ గా ఉన్న మోదుగులపాళెంలో కూడా సుమంత్ కారణంగా వైసిపి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించింది. జనాలకు మంచి జరగాలంటే జగనే సిఎం కావాలంటూ సుమంత్ నేతృత్వంలో వైసిపి చొచ్చుకుపోతుంటే టిడిపి నేతలకు దిక్కుతోచటం లేదు.