కేసీఆర్ ప్రభుత్వం 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పటి నుంచి తెలంగాణలో వరుసగా ఏదో ఒక ఎన్నిక జరుగుతూనే ఉంది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయితీలు, మండలాలు, సహకార సంఘాల ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు, హుజూర్‌నగర్ ఉప ఎన్నిక.ఇక తాజాగా దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికలు ఇలా ఏదో ఒక ఎన్నిక నడుస్తూనే ఉంటోంది. ఇక త్వరలోనే నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి సైతం ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై ఇప్పటికే తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి ఉండగా,ఇప్పుడు ఈ సమ్మర్ అంతా వరుస ఎన్నికలతో తెలంగాణ రాష్ట్రం కాక ఎక్కబోతుందట.
మరో రెండు నెలల్లో ఏడు పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. గ్రేటర్ వరంగల్, ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట మున్సిపాలిటీల గడువు మార్చి 14తో ముగుస్తుంది.ఇక సిద్ధిపేట కార్పొరేషన్ గడువు ఏప్రిల్ 15 వరకు ఉంది. నగర పంచాయితీల నుంచి మున్సిపాల్టీలుగా మారిన నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరుకు ఎన్నికలు పెట్టలేదు. ఇప్పుడు ఈ ఏడు నగర పాలిక సంస్థలకు కలిపి సమ్మర్‌లో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారని తెలుస్తోంది. తెలంగాణ కొత్త మునిసిపల్ ఎన్నికల చట్టం ప్రకారం ప్రస్తుత పాలక వర్గం గడువు ముగియడానికి మూడు నెలల ముందు నుంచే తదుపరి ఎన్నికల సన్నాహాలు చేయాలి. ఇక నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, ఏడు నగర పాలక సంస్థలకు ఎన్నికలతో పాటు రెండు పట్టభద్రుల స్థానాలకు జరిగే ఎన్నికలతో ఈ సమ్మర్ అంతా రాజకీయంగా మళ్లీ హీటెక్కనుంది.దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత మామూలుగానే హీటెక్కిన తెలంగాణ రాజకీయ సెగలు ఇప్పుడు మరింత హీటెక్కడం ఖాయం.