Bifurcation : ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనలో కాంగ్రెస్ పెద్ద పాపానికి ఒడిగట్టిందంటూ పార్లమెంటు సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, కొత్త వివాదానికి తెరలేపారు. రాజకీయ విమర్శల్లో భాగంగా ప్రధాని మోడీ, కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడేందుకు ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన అంశాన్ని ప్రస్తావించి వుండొచ్చు.
కాంగ్రెస్ ‘పాపానికి ఒడిగట్టడం’ అనే మాట నిజమైతే, ఆ పాపంలో వాటా బీజేపీకి కూడా వుంటుంది. నిజమే, బీజేపీ వాటా ఇందులో తక్కువేమీ కాదు. ‘సోనియమ్మ మాత్రమే కాదు, ఈ చిన్నమ్మ కూడా తెలంగాణ కోసం కష్టపడింది.. ఈ చిన్నమ్మని తెలంగాణ ప్రజలంతా గుర్తుపెట్టుకోవాలి..’ అంటూ బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ అప్పట్లో చేసిన వ్యాఖ్యల్ని ఎలా మర్చిపోగలం.?
అడ్డగోలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించిందన్నది మోడీ ఆరోపణ. అది నిజమే అనుకుందాం. ఆ అడ్డగోలు విభజనకు బీజేపీ ఎందుకు సహకరించినట్టు.? పార్లమెంటులో తలుపులు మూసేసి, మైకులు ఆపేసి.. అంటూ మోడీ వ్యాఖ్యానించారు సరే.. ఈ పాపంలో బీజేపీ ఎందుకు భాగం పంచుకుంది.?
తెలంగాణలో ఇప్పుడిప్పుడే కాస్త పుంజుకుంటోన్న బీజేపీని, ప్రధాని నరేంద్ర మోడీ తాజా వ్యాఖ్యలు అత్యంత దారుణంగా దెబ్బ తీసేశాయన్నది నిర్వివాదాంశం. తెలంగాణ సమాజం ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యల్ని హర్షించదు. పోనీ, ఆంధ్రప్రదేశ్‌లో అయినా బీజేపీకి అడ్వాంటేజ్ పెరుగుతుందా మోడీ వ్యాఖ్యలతో.. అంటే అదీ లేదు.
ఎందుకంటే, కాంగ్రెస్ హయాంలో ఏపీకి దక్కిన ప్రత్యేక హోదాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కింది మరి. తెలుగు రాష్ట్రాల్లో మోడీకి వ్యతిరేకంగా ఇప్పుడు ఆందోళనలు షురూ అవడాన్ని బీజేపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అంతా మోడీ మహత్మ్యమే మరి.!