భువనేశ్వరి ‘యాత్ర’కి బస్సు సిద్ధమే.! పార్టీ శ్రేణులో.?

తన బర్త నారా చంద్రబాబునాయుడిని వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని నారా భువనేశ్వరి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి, రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా వున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు.. అదీ నలభై రోజులకు పైగానే.!

ఈ నేపథ్యంలోనే, జనంలోకి వెళుతున్నారు నారా భువనేశ్వరి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటనలు చేసి, నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న భువనేశ్వరి, తాజాగా బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ‘నిజం గెలవాలి’ అనే పేరు కూడా పెట్టారు ఈ యాత్రకి. ప్రత్యేకంగా ఓ బస్సుని కూడా డిజైన్ చేశారు ఆమె కోసం.

ఇక, చంద్రబాబు అరెస్టుతో నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర ఆగిపోయింది. వాస్తవానికి, జనం నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో ఎలాగోలా ఆ యాత్రను ఆపేయాలనుకున్న లోకేష్‌కి, ఇదొక కుంటి సాకు అయ్యిందనే వాదన లేకపోలేదు.

‘యువగళం పాదయాత్ర’ని ఆపేసి, ‘న్యాయం గెలవాలి’ అంటూ బస్సు యాత్రను షురూ చేయడంలో టీడీపీ ఆంతర్యమేంటో తెలుగు తమ్ముళ్ళకి అర్థం కావడంలేదు. చంద్రబాబు అరెస్టవడంతో తట్టుకోలేక కొంతమంది బలవన్మరణానికి పాల్పడ్డారనీ, కొందరు బాధతో గుండె పోటు వచ్చి చనిపోయారనీ టీడీపీ అంటోంది. అలాంటివారి కుటుంబాల్ని భువనేశ్వరి, ‘న్యాయం గెలవాలి’ యాత్రలో భాగంగా పరామర్శిస్తారట.

అంటే, గతంలో వైఎస్సార్ మరణం నేపథ్యంలో వైఎస్ జగన్ ‘ఓదార్పు యాత్ర’ చేపట్టినట్లేనన్నమాట. కానీ, జనాన్ని భువనేశ్వరి యాత్ర కోసం సమీకరించేదెలా.? తెలుగు తమ్ముళ్ళలో ఆ ఓపిక వుందా.? లేదా.? ఇదొక మిలియన్ డాలర్ క్వశ్చన్.