ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి అర్ధాంగి భువనేశ్వరి తొలిసారిగా ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సారికూడ కుప్పం నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న చంద్రబాబు నాయుడి తరఫున ఆమె నామినేషన్ వేయబోతున్నారు. భర్త చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నందున ఆయన తరఫున భువనేశ్వరి కుప్పంలో శుక్రవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్నారు. చంద్రబాబు 1989 నుంచి కుప్పంను సొంత నియోజకవర్గం చేసుకున్నారు. ప్రతి ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు.
దేశంలో ఒక విఐపి నియోజకవర్గంగా పేరుపొందిన చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఆయన అసెంబ్లీకి పోటీ చేయడం ఇది ఏడవ సారి.
గతం ఎన్నికల్లో చాలా సార్లు పార్టీ కార్యకర్తలే చంద్రబాబు తరఫున నామినేషన్ వేశారు. ప్రస్తుతం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటూ కుప్పంకు వచ్చే వీల్లేక పోవడంతో ఆయన ఈ సారి ఈ బాధ్యతను భార్య భువనేశ్వరికి అప్పగించారు.
ఆయన విజయవాడలోనే సివిల్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరై నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. ఇప్పుడా పత్రాలనే భువనేశ్వరి కుప్పంలో ఎన్నికల అధికారులకు అందజేస్తున్నారు. దీనితో ఆమె తొలిసారిగా ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
గతంలో కూడా అమె కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అవి అభివృద్ఢి కార్యక్రమాలు. వాటిలో పాల్గొంటూనే ఇక భువనేశ్వరి రాజకీయాల్లోకి వస్తారని మీడియాలో వూహాగానాలు వచ్చాయి. మొదట ఆమె 2015 డిసెంబర్ లో కృష్ణా జిల్లా పామర్ర మండలంలోని కొమరవోలు లో సిమెంట్ రోడ్ ను ప్రారంభించారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేసేందుకు నిర్వహిస్తున్న జనచైతన్య వేదిక లో పాల్గొంటూ ఆమె రోడ్ ను ప్రారంభించారు. అపుడే గ్రామస్థులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషిచేస్తానని చెప్పారు. తర్వాత గ్రామ సభలో మాట్లాడని డ్వాక్రా మహిళలకు గ్యాస్ సిలిండర్లను పంపిణీచేశారు. ఇవేవీ నేరుగా టిిటిపికి సంబంధించిన కార్యక్రమాలు కావు. ఇపుడు తొలిసారి ఆమె టిడిపి కార్యక్రమంలోపాల్గొనేందుకు అమరావతి నుంచి కుప్పం కు వస్తున్నారు. అక్కడ ఎన్నికల అధికారికి నామినేషన్ ప్రతాలను సమర్పిస్తున్నారు.