పిచ్చుకపై బ్రహ్మాస్త్రం వేయాల్సిన పనేలేదు… “బ్రో” కు కొనసాగింపు?

పవన్ కల్యాణ్ నటించిన “బ్రో” సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోలేదని అంటున్నారు. మరోపక్క వైసీపీ కూడా ఈ సినిమాపై నెగిటివ్ పబ్లిసిటీ చేసింది. సాక్ష్యాత్తు వైసీపీ మంత్రి అంబటి రాంబాబు “బ్రో” నిర్మాత నష్టాల్లో ఉన్నారంటూ లెక్కలు చెప్పారు.

ఈ సమయంలో “భోళా శంకర్” సినిమా విడుదలయ్యింది. ఈ సినిమాపై ఎవరి అంచనాలు వాళ్లకున్నాయి. అయితే ఈ సినిమా విడుదలకు మూడు రోజుల ముందు వాల్తేరు వీర్య్య 200 రోజుల ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీ “భోళా శంకర్” ని కూడా టార్గెట్ చేసిందనే కామెంట్లు వచ్చాయి.

మరోపక్క వైసీపీ నేతలు, మంత్రులూ… చిరంజీవిపై ఫైరయ్యారు. సినిమాళ్లోని పకోడీగాళ్ల సలహాలు తమకు అవసరం లేదని అన్నారు. ఇలా చిరు వర్సెస్ వైసీపీ అన్నట్లుగా వ్యవహారం సాగుతోన్న సమయంలో “భోళా శంకర్” సినిమా విడుదలయ్యింది. అయితే ఈ సినిమా ఫస్ట్ ఆట నుంచీ నెగిటివ్ రివ్యూ తెచ్చుకుందని అంటున్నారు.

పవన్ కు రాజకీయంగా సపోర్ట్ చేసే ఎల్లో మీడియాలో సైతం “భోళా శంకర్” సినిమా రివ్యూలు నెగిటివ్ గా వచ్చాయి. మరికొన్ని న్యూట్రల్ మీడియా సంస్థల్లో కూడా చిరు సినిమాను వాయించి వదులుతున్నారు. మెహర్ రమేష్ కి లేకపోయినా.. చిరు అనుభవం ఏమైందంటూ ఫైరవుతున్నారు. ఈ సినిమా రిజల్ట్ విషయంలో “బ్రో”కి కొనసాగింపని చెబుతున్నారు.

అవును… “భోళా శంకర్” సినిమాలో చిరంజీవి ఖుషీ మూవీలోని ఓ సీన్ రిపీట్ చేశారు. అభిమానులు ఆ సీన్ తో ఎంతవరకూ ఖుషీ అయ్యారనే సంగతి కాసేపు పక్కనపెడితే… సినిమా రిజల్ట్ తో మాత్రం వైసీపీ ఫుల్ ఖుషీగా ఉందని అంటున్నారు. ఈ సినిమా విషయంలో వైసీపీకి కష్టం లేకుండానే.. పనిగట్టుకుని సినిమా పరిస్థితి ఇదీ అని ఎవరికీ చెప్పాల్సిన పనిలేకుండానే ఫలితం వైరల్ అవుతుందని అంటున్నారు.

అభిమానులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఆ స్థాయిలో నిలబెట్టుకున్నారు దర్శకుడు మెహర్ రమేష్. తనకు ఎంతమంది పెద్ద స్టార్లు డేట్స్ ఇచ్చినా… తన ఫెర్మార్మెన్స్ లో మార్పు ఉండదని చెప్పకనే చెప్పుకున్నారు. సినిమా ఫుల్ నెగిటివ్ టాక్ తెచ్చుకుందని అంటున్నారు. రివ్యూ రైటర్లు ఫుల్ గా వయించి వదులుతున్నారు! ఈ సమయంలో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం డైలాగ్ మరోసారి తెరపైకి వచ్చింది.

అవును… ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమా ఫంక్షన్లో పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎందుకంటూ చిరంజీవి.. ఏపీ ప్రభుత్వానికి సూచించారు. ప్రజల బాగు గురించి, రాష్ట్రం అభివృద్ధి గురించి ఆలోచించాలంటూ చురకలంటించారు. అనంతరం వైసీపీ నేతలు ఘాటుగా వాయించి వదిలారు. ఇక ఈ భోళా శంకర్ సినిమా కూడా డల్ అవ్వడంతో సోషల్ మీడియాలో సౌండ్స్ మారాయని అంటున్నారు.

అవును… చిరంజీవి భోళా శంకర్ సినిమా రిలీజ్ తర్వాత మెగా క్యాంప్ నుంచి సౌండ్ తగ్గిందని తెలుస్తోంది.. ఇదే సమయంలో సోషల్ మీడియాలో వైసీపీ సౌండ్ పెరిగిందని అంటున్నారు. పనిగట్టుకుని చిరంజీవిని కానీ, ఆ సినిమాని కానీ వైసీపీ నాయకులు విమర్శించాల్సిన అవసరం లేదన్నట్లుగా సినిమా ఫలితం ఉందని సమాచారం. పిచ్చుకపై ఎవరూ బ్రహ్మాస్త్రం వేయాల్సిన పనిలేదంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు!