బండారు దిగజారుడు వ్యాఖ్యలు… బేడీలు రెడీ అవుతున్నట్లేనా?

రాజకీయాల్లో విజ్ఞత లేనివాళ్లు, సంస్కారం లేనివాళ్లు, సభ్యత లేనివాళ్లు, నిస్సుగ్గు చర్యలకు ఉపక్రమించేవాళ్లూ ఎక్కువైపోతున్నారనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మహిళలపై అసభ్యంగా మాట్లాడే సంస్కార హీనులు కూడా ఎక్కువైపోతున్నారని ఈ మధ్యకాలంలో విమర్శలు ఎక్కువగా వినిపించాయి. ఈ క్రమంలో తాజాగా టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ ముర్తి, మహిళా మంత్రి ఆర్కే రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

మంత్రి రోజాపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకి మహిళా రాష్ట్రపతి ద్రౌపతి ముర్మూ ఆమోదం తెలిపిన రోజే.. సాక్షాత్తూ ఓ మహిళా మంత్రిపై అత్యంత హేయమైన, ఏమాత్రం ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ప్రెస్ మీట్ పెట్టి మరీ మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ నిస్సిగ్గు వ్యాఖ్యలు చేశారు.

తన దగ్గరున్న వీడియోలు బయటపెడితే రోజా, ఆమె భర్త ఆత్మహత్య చేసుకుంటారని.. ఆమె కుటుంబం చిన్నాభిన్నమవుతుందని బండారు హెచ్చరించడం గమనార్హం. ఈ హెచ్చరికలు, అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెళ్లువెత్తాయి. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో మహిళా కమిషన్ సీరియస్ అయింది.

అవును… మంత్రి రోజాపై పనికిమాలిన వ్యాఖ్యలు చేసిన బండారు సత్యనారాయణను అరెస్టు చేయాలంటూ డిమాండ్ లు వినిపిస్తున్న నేపథ్యంలో… డీజీపీకి లేఖ రాశారు ఏపీ మహిళా కమిషన్ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ.

అంతకంటే ముందు రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలపై సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మ సోషల్ మీడియాలో మహిళా కమిషన్ కర్తవ్యాన్ని గుర్తు చేశారు. జాతీయ మహిళా కమిషన్ ని కూడా ట్యాగ్ చేస్తూ ఆయన బండారు ఇంటర్వ్యూ లింక్ ని షేర్ చేశారు. ఈ క్రమంలో తాజాగా మహిళా కమిషన్ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాసింది.

ప్రెస్ మీట్ లో బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడిన నీచమైన భాష జుగుప్సాకరంగా ఉందని తన లేఖలో పేర్కొన్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. ఒక మంత్రిపై, మహిళా నేతపై ప్రెస్ మీట్ లు పెట్టి మరీ బండబూతులు మాట్లాడుతున్నారని, ఇలాంటివాటిని ఎంత మాత్రం సహించరాదని పేర్కొన్నారు. వెంటనే కేసు నమోదు చేసి బండారుని అరెస్టు చేయాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. దీంతో… త్వరలో బండారుకు బేడీలు రెడీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది!