టిడిపి నుండి ఎన్నికల బరిలోకి లోకేష్ బంధువు

ఆంధ్రాలో ఎన్నికల హడావిడి మొదలైంది. నేతలు పార్టీలు మారడం, కొత్తవారు రాజకీయ అరంగేట్రం చేయడం, సీనియర్ నేతలు తాము వైదొలగి వారసులను ప్రవేశపెట్టే పనిలో ఉన్నారు. ఇప్పటికే అనంతపూర్ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో తాను పోటీ చేయనని, తన కుమారుడు పవన్ కుమార్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబుకి తన మనసులోని మాట తెలిపారు.

తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అన్న బాటలోనే తన స్థానంలో కొడుకు అస్మిత్ రెడ్డికి వికాసం కల్పించాలని ముఖ్యమంత్రిని కోరారు. జేసీ బ్రదర్స్ ప్రతిపాదనలకు టిడిపి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక శ్రీకాకుళం పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామ్ సుందర్ శివాజీ రానున్న ఎన్నికల్లో తాను పోటీ నుండి విరమించుకుంటానని, ఆ స్థానంలో తన కూతురు శిరీష బరిలోకి దిగుతారని విజ్ఞప్తి చేయగా టిడిపి అధిష్టానం కూడా సరే అంది. ప్రస్తుతం శిరీష శ్రీకాకుళం జిల్లా టిడిపి అధ్యక్షురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఇక మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్, మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ ఎన్నికల్లో
పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నట్టు తెలుస్తోంది. కాగా వీరిద్దరి వ్యవహారం కొంచెం దూకుడుగా ఉంటుందని ఇమేజ్ పడటంతో అధిష్టానం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఏపీ ఐటి శాఖ మంత్రిగా కొనసాగుతున్న ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీలోకి దిగనున్నారు. అంతేకాదు ఆయన తోటి అల్లుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండో అల్లుడు భరత్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి. భరత్ తాత ఎంవీవీఎస్ మూర్తి విశాఖ మాజీ ఎంపీ. ఇప్పుడు విశాఖ ఎంపీ సీటుకు భరత్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నట్టు ప్రచారంలో ఉంది. ప్రస్తుతం భరత్ కుటుంబ వ్యాపారాలతో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.