ఏపీలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి వైసీపీ ప్రభుత్వం నుంచి ప్రతి నెలా కరెక్ట్ గా పథకాలు అందుతున్నాయనే సంగతి తెలిసిందే. సంక్షేమ పథకాల అమలు విషయంలో ఏపీకి పోటీనిచ్చే మరో రాష్ట్ర ప్రభుత్వం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలవుతున్నా ప్రజలు సంతృప్తితో ఉన్నారా అనే ప్రశ్నకు మాత్రం కాదనే సమాధానం వినిపిస్తోంది.
రోడ్లపై గుంతలు ఉండటం, చెత్తపన్నును వసూలు చేయడం, నిత్యావసర వస్తువుల ధరలను అంతకంతకూ పెంచుతుండటం, ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుండటం, దూరప్రాంతాలకు ఊహించని స్థాయిలో ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతుండటం, ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాకపోవడం, ప్రభుత్వ ఆస్పత్రులలో మందుల కొరత, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పథకాల కోత విధించడం, ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఈ ఇబ్బందులలో కొన్నింటికి చెక్ పెట్టే దిశగా బాలయ్య లోకేశ్ అడుగులేస్తున్నారు.
పూర్తిస్థాయిలో కాకపోయినా తమా వంతుగా ఏపీ ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే ఆలోచనతో మామా అల్లుళ్లైన బాలయ్య లోకేశ్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రశంసలు పొందుతున్నాయి. 2024 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి గెలవాలని లోకేశ్ భావిస్తుండగా ఇప్పటికే రెండుసార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ హిందూపురంలో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని అనుకుంటున్నారు.
లోకేశ్ మంగళగిరిలోని వేర్వేరు ప్రాంతాలలో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రశంసలు పొందారు. బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురంలో కూడా అన్న క్యాంటీన్ ఏర్పాటైంది. ప్రస్తుతం అటు లోకేశ్ ఇటు బాలయ్య తమ నియోజకవర్గాలలో ఆరోగ్య రథాలను ఏర్పాటు చేస్తూ ప్రశంసలను పొందుతున్నారు. వీటి ఏర్పాటు ద్వారా లోకేశ్ బాలయ్య వైసీపీ పరువు తీస్తున్నారు.