నందమూరి తారకరామారావు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ… ఆయన ఆశయాలను తుంగలోకి తొక్కిన కుటుంబ సభ్యులే మరణానంతరం ఆయన పేరును ఫుల్ గా వాడేస్తున్నారు. ఆయన అకాల మరణానికి ప్రత్యక్ష, పరోక్ష కారకులైనవారే ఆయన జయంతులూ, వర్థంతులూ ఘనంగా చేసేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఇంతకాలం చంద్రబాబే అనుకుంటే.. బాలయ్య కూడా బావ తరహాలోనే ఎన్టీఆర్ పేరును రాజకీయాలకు పుష్కలంగా వాడేస్తున్నారు.
ఆరునెలల సావాసం చేస్తే వారు వీరవుతారన్న క్రమంలో చేస్తున్నారో.. లేక, బావ సూచనల మేర చెబుతున్నారో తెలియదు కానీ… తాజాగా “ఎన్టీఆర్ కు భారతరత్న” అనే విషయంపై మాట్లాడారు నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో “తెలుగు వారి ఆత్మ గౌరవానికి వందేళ్లు” పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ… ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. దీంతో కీబోర్డులకు పనిచెబుతున్నారు నెటిజన్లు.
“ఎన్టీఆర్ కి దింపేసిన” తర్వాత… టీడీపీ నుంచి సుమారు 14ఏళ్లకు పైగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయాల్లో కేంద్రంలో కూడా.. ఆయనతో పొత్తులో ఉన్న పార్టీనే అధికారంలో ఉంది. ఒకానొకదశలో అయితే టీడీపీ నుంచి కేంద్రప్రభుత్వంలో మంత్రులు, సహాయ మంత్రులూ కూడా ఉన్నారు. ఆ సమయంలో తాను ఎంతంటే అంత జరిగిందని కూడా చెబుతుంటారు చంద్రబాబు. రాష్ట్రపతుల ఎంపికలో సైతం తాను సూచించినవారే ఉన్నారని చెబుతుంటారు. మరి ఆయా సమయాల్లో ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనే ఆలోచన బాబు ఎందుకు చేయలేదు.. బాలయ్య ఎందుకు డిమాండ్ చేయలేదు? బాబుకీ బాలయ్యకీ తెలియంది కాదు!
ఇప్పుడు కూడా ఎన్టీఆర్ కి భారతరత్న అవార్డు ఇవ్వాలనే డిమాండ్ చంద్రబాబు చేసినా.. బాలయ్య బాబు చేసినా… అది పూర్తిగా ఎన్నికల స్టంట్ అనేది వాస్తవం! కారణం… ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇస్తే.. ఆ అవార్డును హస్తిన వేదికగా, రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయనభార్య హోదాలో లక్ష్మీపార్వతి అందుకుంటారు. ఇది చంద్రబాబు – బాలయ్య బాబులకు ఏమాత్రం ఇష్టం లేని విషయం. ఇది బాబుకూ తెలుసు – బాలయ్యకూ తెలుసు. వీరిద్దరికీ తెలుసన్న విషయం తెలుగు ప్రజలందరికీ తెలుసు. అయినా కూడా… ఎన్టీఆర్ ను, ఆయన అభిమానులను వెర్రివాళ్లను చేస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు తాజాగా బాలయ్య బాబు డిమాండ్ చేస్తుంటారు.. అనంతరం లైట్ తీసుకుంటుంటారు!