ప్రణయ్ హత్యపై ఆంధ్రా అసెంబ్లీలో బాబు స్టేట్మెంట్

తెలంగాణలోని మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కులమతాలకు అతీతంగా పిల్లలకు పెళ్లి చేయించాల్సిన బాధ్యత పెద్దలపై ఉందని అహంకారం, అహంభావంతో మనుషులను చంపే స్థితికి దిగజారడం ఆందోళనకరమైన విషయమన్నారు. తాము పెళ్లికానుక పథకాన్ని తీసుకురావడం వెనకున్న ముఖ్య ఉద్దేశం కులాంతర వివాహాలను ప్రోత్సహించడమేనని ,పెళ్లికానుక పథకంలో కులాంతర వివాహాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చామని చెప్పారు. ప్రణయ్ హత్య పై చంద్రబాబు అసెంబ్లీలో స్పందించారు.

తక్కువ కులం ఉన్న వ్యక్తిని కూతురు పెళ్లి చేసుకుందనే ఉద్దేశంతో ఆమె భర్తను కన్న తండ్రే చంపించాడంటే… ఈ సమాజంలో ఎంతటి అహంకారం ఉందో అర్థం చేసుకోవచ్చని చంద్రబాబు అన్నారు. అబ్బాయి మంచివాడు అయినప్పుడు, అమ్మాయికి నచ్చినప్పుడు, పెళ్లి చేసుకుని వారిద్దరూ సంతోషంగా ఉంటారని భావించినప్పుడు… తల్లిదండ్రులు వారికి పెళ్లి చేసి, ఆశీర్వదించాలని చెప్పారు. ఒకవేళ ఇష్టం లేకపోతే, వారి మానాన వారిని వదిలేయాలని… ఇలా దారుణంగా హతమార్చడం అనాగరిక చర్య అని అన్నారు. ఈ హత్య వల్ల అమ్మాయి తండ్రి సాధించింది ఏమీ లేదని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు స్పందించినా ఆపద్దర్మ సీఎం కనీసం మాట్లాడకపోవడం పై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.