పాదయాత్ర అనగానే మనకు గుర్తొచ్చేది రాజకీయ నాయకులు చేసే నడక యాత్రలు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం పొలిటికల్ లీడర్లు పాదయాత్ర చేస్తారు. తద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలు పరిష్కరిస్తారని జనాలు నమ్ముతారు. తెలుగు నేల మీద పాదయాత్రలు చేసిన ప్రముఖుల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, వైఎస్ కూతురు షర్మిల ప్రముఖంగా కనిపిస్తారు.
ఏ రాజకీయ లక్ష్యం లేకుండా సైతం తెలుగు నేల మీద పాదయాత్రలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఆ పాదయాత్రలకు రాజకీయ ప్రయోజనం ఉండదు కాబట్టి జన బాహుళ్యంలో చర్చనీయాంశం కావు. కాలుకు చెప్పులు లేకుండా ఒంటిపై నల్ల వస్త్రాలు ధరించి ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ చలికి వనుకుతూ వందల కిలోమీటర్లు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు హైదరాబాద్ కు చెందిన అయ్యప్ప భక్తులు. దైవ చింతనతో చేసే ఈ మహా పాదయాత్రకు 27 ఏండ్ల చరిత్ర ఉంది. ఆ వివరాలు చదవండి.
హైదరాబాద్ కు చెందిన 120 మంది అయ్యప్ప మాలలు ధరించిన భక్తులు శుక్రవారం సికింద్రాబాద్ లోని గణపతి దేవాలయంలో పూజా కార్యక్రమాలు చేసి శబరి మల అయ్యప్ప దేవస్థానం వరకు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. శ్రీ ధర్మశాస్త్ర పాద యాత్ర బృందం శుక్రవారం ఉదయం 5:30 గంటలకే గణపతి హోమము, పంచామృతాలతో స్వామి వారికి అభిషేకం, అర్చన, మహా హారతి తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం 8:30 గంటలకు మొదలైన పాదయాత్ర ముషీరాబాద్, ఆర్టీసి x రోడ్, నారాయనగూడ, చార్మినార్ మీదుగా భేలా చేరుకున్నది. సదానంద యాదవ్ ఏర్పాటు చేసిన పూజ కార్యక్రమంలోపాల్గొని భిక్ష (అయ్యప్ప స్వాములు చేసే మధ్యాహ్న భోజనం) చేసి శంషాబాద్ కు బయలుదేరి వెళ్లారు.
అక్కడి నుంచి 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేరళ రాష్ట్రంలోని శబరిమల కు కాలి నడకన బయలుదేరారు. స్వామియే శరణం అయ్యప్ప అని నినదిస్తూ పాదయాత్ర జరుగుతూ ఉన్నది. 38 రోజులు నడక మార్గంలో ప్రయాణించి శబరిమల కొండలు చేరుకుంటామని అయ్యప్ప భక్తులు తెలిపారు. గురు స్వామి గడ్డం వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ మహా పాదయాత్రలో స్వాములు బయలుదేరారు. ఈ పాదయాత్ర బృందం పేరు శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం.
ఈ తరహా పాదయాత్ర హైదరాబాద్ లోని అయ్యప్ప భక్తులు 27 ఏళ్లుగా కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రతి ఏటా కార్తీక మాసం మొదలు కాగానే భక్తులు స్వామి మాల వేసుకున్న తర్వాత వారం పది రోజులు హైదరాబాద్ లో ఉంటారు. ఆ తర్వాత చలో శబరిమల అంటూ అయ్యప్ప సన్నిదానం పాదయాత్ర షురూ చేస్తారు.
స్వాముల పాదయాత్రకు రెండున్నర దశాబ్దాల చరిత్ర
తొలుత వేణుగోపాల గురు స్వామి 27 ఏండ్ల క్రితం ఒక్కడే హైదరాబాద్ నుంచి పాదయాత్ర తో మొదలై శబరిమలకు వెళ్లారు. ఆయన అప్పటి నుంచి తాను మాల ధరించిన ప్రతిసారి పాదయాత్ర ద్వారానే అయ్యప్ప దర్శనానికి వెళ్లేవాడు. అలా మొదలైన అయ్యప్ప స్వాముల పాదయాత్ర ఇప్పటికీ నిరంతరాయంగా కొనసాగుతున్నది. 2013లో వేణుగోపాల గురు స్వామి మరణించారు.
వేణుగోపాల గురుస్వామి మరణానంతరం ఆయన శిష్య శిష్య బృందం ఈ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అప్పుడు ఒకే బృందం ఉండగా ఇప్పుడు శాఖోపశాఖలుగా స్వాముల బృందాలు పెరిగాయి. ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా కామారెడ్డి, కరీంగనర్, నిజామాబాద్, సంగారెడ్డి , మెదక్ జిల్లాల నుంచి ఈ బృందాలు మహా పాదయాత్ర చేపడుతున్నాయి. ఇలా పాదయాత్ర ద్వారానే వెయ్యి మందికి పైగా అయ్యప్ప భక్తులు శమరిమల వెళ్తున్నారు.
మార్గ మధ్యలో ఎక్కడ చీకటైతే అక్కడ ఉన్న దేవాలయాన్ని ఎంచుకుని స్వాములు రాత్రి సేదదీరుతారు. పాదయాత్ర వెంట తమకు అవసరమైన సరుకులు తీసుుని వెళ్తారు. తమ వంట తామే చేసుకుంటూ పాదయాత్రను కంటిన్యూ చేస్తారు. వంట చేసుకునే వెసులుబాటు లేకపోతే స్వాముల కోసం ప్రత్యేకమైన భోజనం అందజేసే హోటళ్లలో భిక్ష చేసి తమ యాత్రను కొనసాగిస్తారు.
అయ్యప్ప భక్తుల పాదయాత్ర, గణపతి దేవాలయంలో చేసిన పూజా కార్యక్రమాల వీడియోలు చూడండి.