2024లో ఓటమికి ఇప్పటినుంచే సాకులా అచ్చెన్నా..?

కారణం ఏమిటో తెలియదు కానీ చంద్రబాబుని టెన్షన్ పెట్టేలా మాట్లాడటానికి ఆన్ ది రికార్డ్.. ఆఫ్ ద రికార్డ్ అచ్చెన్నాయుడు ఉత్సాహం చూపిస్తుంటారు. నిజంగా అవి మనసులోనుంచే వస్తాయో.. వాస్తవాలను పరిగణలోకి తీసుకోవడం వల్లే అనిపిస్తాయో.. లేక, చంద్రబాబుని కావాలని గిల్లానే ఉద్దేశ్యంతో వస్తాయో తెలియదు కానీ… అప్పుడప్పుడూ ఇలాంటి డైలాగులు కొన్ని వదులుతుంటారు అచ్చెన్న.

గాంలో పార్టీలేదు.. &%$# లేదు. పార్టీ పని అయిపోయింది అంటూ ఆఫ్ ద రికార్డ్ మాట్లాడినా.. అవి ఆన్ రికార్డ్ అయిపోయాయి.. అనంతరం ఆన్ ఎయిర్ అయిపోయి సంచలనంగా మారిపోయాయి. అయితే ఈ విషయాలపై తర్వాత అచ్చెన్న చంద్రబాబుకు సంజాయిషీ ఇచ్చుకున్నారా లేదా అనేది తెలియదు కానీ… టీడీపీ కార్యకర్తలకైతే మాత్రం ఇచ్చినట్లు లేదు. అయితే కొంతకాలం తర్వాత మళ్లీ పార్టీలో యాక్టివ్ అయిపోయారు. ఇంక తప్పదన్నట్లుగా లోకేష్ – చంద్రబాబులు కూడా అచ్చెన్నను పక్కన కుర్చోబెట్టుకోవడం మొదలుపెట్టారు.

ఆ డైలాగులు ఇప్పటికీ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుండగా.. మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు. అవును… తాజాగా మైకందుకున్న అచ్చెన్న… తనతో సహా పార్టీ నేతలెవరూ పూర్తి స్ధాయిలో పనిచేయడం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రజలు అధికారం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నా కూడా.. తాము మాత్రం పూర్తిస్ధాయిలో పనిచేయట్లేదని ఆయన చెప్పుకొచ్చారు.

టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీలుగా చేపట్టిన బస్సు యాత్రల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హ్రం. ఈ సందర్భంగా స్పందించిన ఆయన… టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. కానీ తనతో సహా నేతలు ఎవరూ కూడా పూర్తి స్థాయిలో పని చేయడం లేదనే ఫీలింగ్ ఉందని అచ్చెన్నాయుడు నిర్వేదం వ్యక్తంచేశారు.

అయితే… 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం స్పందించిన చంద్రబాబు… ప్రజలు తమను ఈ స్థాయిలో తిరస్కరించడానికి, ఇంత ఘోరంగా ఓడించడానికి గల కారణాలేమిటనేది తనకు అర్ధం కావడం లేదని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో చేసిన గొప్ప పనులన్నీ ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యామని.. అందువల్లే ఓడిపోయామని సన్నాయి నొక్కులు నొక్కారు. దీంతో… రాబోయే ఎన్నికల ఫలితాల తర్వాత కూడా… “ప్రజలు తమనే కోరుకున్నారు కానీ.. తామే సరిగ్గ పనిచేయలేదని” చెప్పడానికి అచ్చెన్న ఇప్పటినుంచే ప్లాన్ చేసుకున్నారని ఈ సందర్భంగా కామెంట్లు వినిపిస్తున్నాయి.