టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం మళ్లీ మొదలైంది. గతంలో ఒకసారి ఈ హడావిడి, ఆ మేరకు ఆందోళన నెలకొన్నప్పటికీ అనంతరం అందరికీ క్లీన్ చీట్స్ వచ్చేశాయి! అయితే తాజాగా కబాలి చిత్ర నిర్మాత కేపీ చౌదరి వ్యవహారంతో మరోసారి టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం మొదలైంది. ఇందులో భాగంగా పలువురు సెలబ్రెటీల పేర్లు తెరపైకి వస్తున్నాయి.
అవును… కబాలీ తెలుగు సినిమా నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఇందులో భాగంగా సెలబ్రిటీల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బిగ్ బాగ్ తెలుగు రియాల్టీ షో కంటెస్టెంట్ అషురెడ్డితో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు, పలువురు ప్రముఖులు, వ్యాపార వేత్తలకు కేపీ చౌదరి డ్రగ్స్ ను సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ఈ విషయంలో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
సెలబ్రిటీలు, రాజకీయ నేతల కుమారులు, ప్రముఖులు 12 మందికి కొకైన్ విక్రయించినట్లు పోలీసుల విచారణలో కేపీ చౌదరి ఒప్పుకున్నాడని తెలుస్తుంది. వివిధ ప్రాంతాలకు చెందిన బెజవాడ భరత్, వందనాల అనురూప, చింతా సాయి ప్రసన్న, చింతా రాకేష్ రోషన్, నల్లా రతన్ రెడ్డి, ఠాగోర్ ప్రసాద్ మోటూరి, తేజ్ చౌదరి, వంటేరు శవన్ రెడ్డి, సనా మిశ్రా, శ్వేత, సుశాంత్, నితినేష్ వీరిలో ఉన్నారని అంటున్నారు.
ఇదే సమయంలో సురేష్ రాజు, రతన్ రెడ్డి, గోవాలోని మీరాజ్ క్లబ్ మేనేజింగ్ పార్ట్ నర్ దీక్షయ్, సినీ ఆర్టిస్టు జ్యోతి, డాక్టర్ సుధీర్ లతో కేపీ చౌదరి వందలాది ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తుంది. ఈ ఏడాది మేలో కేపీ చౌదరి, తన స్నేహితుడు బెజవాడ భరత్ తో కలిసి బెంగళూరుకు వెళ్లి అక్కడ డ్రగ్స్ పార్టీ నిర్వహించగా.. అందులో పైన చెప్పుకున్న వారంతా హాజరయినట్లు సమాచారం.
కాగా… వారం రోజుల క్రితం గోవా నుంచి హైదరాబాద్ కు కొకైన్ ను సరఫరా చేసి విక్రయించే క్రమంలో మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్ టీం, రాజేంద్రనగర్ పోలీసులు కిస్మత్ పూర్ క్రాస్ రోడ్ వద్ద కేపీ చౌదరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కేపీ చౌదరి సెల్ ఫోన్ లను స్వాదీనం చేసుకున్న పోలీసులు.. వాట్సాప్ చాటింగ్స్, ఫొటోలు, బ్యాంకు లావాదేవీలను విశ్లేషించారు.