మొత్తానికి వారం రోజుల తర్వాత డేటా చోరీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక వ్యక్తి దాకవరపు అశోక్ బయటకు వచ్చారు. బయటకు వచ్చారంటే పోలీసులకు కనబడ్డారనో లేకపోతే మీడియా ముందుకు వచ్చారనో కాదు. డేటా చోరీ స్కాంలో తన ప్రమేయం లేదంటూ కోర్టులో ఓ పిటీషన్ వేశారు. డేటా చోరీ స్కాంలో తెలంగాణా పోలీసులు నమోదు చేసిన కేసులో తన పేరు కొట్టేయాలని పిటీషన్లో కోర్టును రిక్వెస్ట్ చేశారు.
హైదరాబాద్ లోని మాదాపూర్, ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్లో తనపై పెట్టిన కేసును కొట్టేయాలని కూడా కోరటం గమనార్హం. అశోక్ దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ ను కోర్టు సోమవారం విచారించనున్నది. దాదాపు వారం క్రితం బయటపడిన డేటా చోరీ స్కాం రెండు రాష్ట్రాల్లోను రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
ఐటి గ్రిడ్స్ కంపెనీ పెట్టి ఏపిలోని 3.5 కోట్లమంది ప్రజల వ్యక్తిగత వివరాలను ప్రభుత్వం నుండి తీసుకున్నారనేది అశోక్ పై ప్రధాన ఆరోపణలు. ఆ డేటా ఆధారంగా వైసిపికి పడతాయని అనుకున్న లక్షలాది ఓట్లను టిడిపి తీసేయిస్తోందని చంద్రబాబునాయుడు పైన కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ కో తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఆ స్కాం దర్యాప్తు కోసం తెలంగాణా పోలీసులు సిట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఎలాగూ కోర్టులో పిటీషన్ వేశారు కాబట్టి రెండు మూడు రోజుల్లో అశోక్ పోలీసుల ముందుకు రాక తప్పదు. అప్పుడే స్కాంలో అసలు సూత్రదారులెవరో తెలుస్తుంది.