నారా లోకేష్ కూడా అరెస్టయితే.! ఏం జరుగుతుందబ్బా.?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ మీద రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారానికి సంబంధించి కేసు నమోదయ్యింది. ఈ కేసులో ఏ14 నిందితుడిగా నారా లోకేష్ పేరుని ఏపీ సీఐడీ చేర్చింది. రేపో మాపో నారా లోకేష్ అరెస్టవడం ఖాయం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

‘నన్ను అరెస్టు చేసి గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నారు.. ఖచ్చితంగా వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా..’ అని నారా లోకేష్ ఇప్పటికే ప్రకటించారు. మరోపక్క, లోకేష్ ‘యువగళం’ పాదయాత్రను పునఃప్రారంభిస్తున్నారు. అదే రోజున ఆయన్ని అరెస్టు చేస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. దీన్ని ఉత్త ప్రచారంగా కొట్టి పారేయలేం.

నారా లోకేష్‌కి గిఫ్ట్ గట్టిగానే ఇవ్వాలని వైసీపీ కంకణం కట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే తెరవెనుక వ్యవహారాలు నడుస్తున్నాయి. చంద్రబాబుని ఎలాగైతే టార్గెట్ చేశారో, నారా లోకేష్ విషయంలోనూ అదే జరగబోతోంది. అంటే, అరెస్టు నుంచి ముందస్తు ఉపశమనానికి ఆస్కారం వుండకపోవచ్చన్నమాట. అరెస్టయ్యాక కూడా ఉపశమనం దొరకదన్నమాట.

దీన్ని ముందుగానే ఊహించిన లోకేష్, న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ పిటిషన్ విచారణ ఏమవుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇందులో సస్పెన్స్ ఏమీ లేదు, నారా లోకేష్‌కి ఊరట దొరికే ఛాన్స్ లేదని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.

వైసీపీ ఏం చెబుతోందో, అరెస్టుల విషయంలో అదే జరుగుతోంది. న్యాయస్థానాల్లో రాబోయే తీర్పుల్ని కూడా వైసీపీ శ్రేణులు ముందే లీక్ చేస్తుండడం గమనార్హం. సో, లోకేష్‌కీ చంద్రబాబుకి పట్టిన గతే పట్టబోతోందన్నమాట.