దొంగ ఓట్లకు ఇలా కూడా మోసం చేయొచ్చా ?

మోసాలు అనేక రకాలు. అందులో పై ఫొటోలో చూపుతున్న అవకాశం తాజాగా వైరల్ అవుతోంది. ఆర్టిఫిషియల్ ఫింగర్స్. ఏదైనా ప్రమాదాల్లో వేళ్ళు పోగొట్టుకున్న వాళ్ళకు అమర్చేందుకు రూపొందించిందే ఆర్టిఫిషియల్ ఫింగర్స్. కానీ వాటినే రేపటి ఎన్నికల్లో మోసాలు చేయటానికి ఉపయోగించే అవకాశాలున్నాయన్నది నెటిజన్ల ఆందోళన.

మామూలుగా ఓటు వేయటానికి పోలింగ్ కేంద్రాలకు వెళ్ళినపుడు చేతివేలిపై ఇంకు ముద్ర వేస్తారు. ఆ ఇంకు ముంద్ర కూడా తొందరగా చెరిగిపోదు. ముద్ర ఎందుకు వేస్తారంటే ఓటు హక్కును వినియోగించుకున్నారనే ఆధారం కోసం. కానీ కొందరు ప్రబుద్దులుంటారు లేండి వెంటనే ఇంకును చెరిపేసుకోగలిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళు రెండోసారి దొంగ ఓటు వేసేందుకు ప్రయత్నిస్తారు.

అయితే, ఇవిఎంలు వచ్చేసిన తర్వాత దొంగ ఓట్లు వేసే అవకాశాలు దాదాపు తగ్గిపోయాయనే చెప్పాలి. కానీ పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లు, పోలింగ్ సిబ్బందిని మాయచేస్తే దొంగఓట్లు వేసుకోవటం ఇప్పుడు కూడా సాధ్యమే అని మొన్నటి నంద్యాల ఉపఎన్నికలో రుజువైంది. అలాంటి అవకాశాలను అడ్డుకునేందుకే కొందరు నెటిజన్లు ఆర్టిఫిషియల్ ఫింగర్స్ ను వెలుగులోకి తెచ్చారు.  

ఆర్టిఫిషియల్ ఫింగర్ ను ఎవరైనా మామూలు వేలికి తొడిగేసుకోవచ్చు.  పోలింగ్ అధికారి పెట్టిన ఇంకు మార్కు ఆర్టిఫిషియల్ ఫింగర్ పైనే పడుతుంది. ఎలాగూ ఆర్టిఫిషియల్ ఫింగరే కాబట్టి తుడిచేయటం కూడా సులభమే. అలాంటివి ఓ పది ఫింగర్లను దగ్గర పెట్టుకున్నారనుకోండి పోలింగ్ ముగిసే సమయంలో దొంగ ఓట్లు వేసుకునే అవకాశం ఉందన్నది నెటిజన్ల ఆందోళన. కాబట్టి పోలింగ్ అధికారులు ఇంకు మార్కు పెట్టేముందు వేలిని లాగి చూడాలని కూడా నెటిజన్లు సలహా ఇస్తున్నారు. మరి అధికారులు ఏం చేస్తారో చూడాలి.