APSRTC: మొంథా తుపాన్‌పై ఆర్టీసీ అలర్ట్‌.. ప్రయాణికుల కీలక ఆదేశాలు..!

రాష్ట్రాన్ని వణికిస్తున్న మొంథా తుపాన్ వేగంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఆగ్నేయ, తూర్పు తీర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా, వాతావరణ శాఖ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. రాబోయే గంటల్లో గాలివానలు బీభత్సం సృష్టించే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ముఖ్యంగా ప్రజా రవాణా రంగమైన ఏపీ ఆర్టీసీ పూర్తి స్థాయిలో సిద్ధమైంది.

ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు అన్ని జిల్లాల డిపో మేనేజర్లు, రీజనల్ అధికారులతో అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాన్ సమయంలో ప్రజల ప్రాణభద్రతే ముఖ్యమని స్పష్టం చేస్తూ, పరిస్థితులను బట్టి బస్సు సర్వీసులను నియంత్రించాలని ఆదేశించారు. ఏ ప్రాణనష్టం జరగకూడదు. ఎక్కడా ప్రమాదాలకు తావివ్వొద్దు. బస్సులు నడపాలా లేదా అన్నది స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయించండి.. అని ఆయన ఆదేశించారు.

తుపాన్ ప్రభావిత జిల్లాల్లో గాలులు వేగంగా వీయడంతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని గుర్తు చేశారు. వంతెనలు, రోడ్లపై నీరు నిలిచిపోయిన చోట్ల బస్సులు ఆపేయాలని, ప్రమాదకర మార్గాల్లో ప్రయాణం మానుకోవాలని స్పష్టం చేశారు. అవసరమైతే బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు. ప్రజల రక్షణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించాలన్న ఎండీ, జిల్లా కలెక్టర్ల అభ్యర్థన మేరకు పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించేందుకు వాహనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. బస్టాండ్లలో ప్రయాణికులకు తాగునీరు, వసతి, భద్రతా సదుపాయాలు కల్పించాలన్నారు.

ప్రజల ప్రాణాల కంటే విలువైనది ఏదీ లేదన్నారు. రోడ్ల పరిస్థితి సరిగా లేనప్పుడు రిస్క్ తీసుకోవద్దు. అవసరమైతే బస్సులు నిలిపి ఉంచి తర్వాత నడపండి, అని ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. వర్షం కారణంగా ఎక్కడైనా మట్టిచరియలు, చెట్లు కూలిపోతే వెంటనే స్థానిక పోలీస్, ఆర్డీఓలతో సమన్వయం సాధించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అదే సమయంలో బస్టాండ్లలో ఉండే ప్రజలు ఇబ్బందులు పడకుండా ఎండీ ప్రత్యేక సూచనలు జారీ చేశారు. శానిటేషన్, తాగునీటి సరఫరా, లైటింగ్‌ వంటి అంశాలను వెంటనే పర్యవేక్షించాలని సూచించారు. ప్రయాణికులకు సమాచారాన్ని తక్షణమే అందించేందుకు డిస్ప్లే బోర్డులు, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్ ద్వారా ప్రకటనలు చేయాలని చెప్పారు.

తుఫాన్ తీవ్రతను బట్టి తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఆర్టీసీ ఇప్పటికే హైఅలర్ట్‌లో ఉందని అధికారులు తెలిపారు. ఏ రూట్‌లో ఎప్పుడు బస్సులు నడపాలో కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం మార్గదర్శకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తుపాన్ పరిస్థితులు మరింత తీవ్రమైతే, ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం బస్సు సేవలను పునర్వ్యవస్థీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు అవసరం లేకుండా ప్రయాణాలకు దూరంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బస్సులు ఉపయోగించాలని సూచించారు. మొత్తానికి మొంథా తుపాన్ ప్రభావం తీర ప్రాంతాలను వణికిస్తున్న తరుణంలో, ప్రజా రవాణా రంగం అప్రమత్తమైంది.