దేవర డ్యాన్స్ తో సస్పెన్షన్.. ఆర్టీసీ డ్రైవర్ తో లోకేష్ స్పెషల్ మీట్!

తుని ఆర్టీసీ డిపో డ్రైవర్ లోవరాజు, విధి నిర్వహణలో సరదాగా చేసిన డ్యాన్స్ కారణంగా సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మంత్రి నారా లోకేశ్ హస్తక్షేపంతో లోవరాజు తిరిగి విధుల్లోకి చేరే అవకాశం పొందారు. తనకు న్యాయం చేసిన లోకేశ్‌ను కుటుంబంతో కలసి లోవరాజు కృతజ్ఞతలు తెలిపారు.

తుని డిపోకు చెందిన లోవరాజు, రౌతులపూడి నుంచి తుని వెళ్తున్న బస్సును మార్గమధ్యంలో ట్రాక్టర్ అడ్డుపడడంతో ఆపాల్సి వచ్చింది. ఈ సమయంలో ప్రయాణికుల సరదా కోసం ‘దేవర’ సినిమాలోని పాటకు డ్యాన్స్ వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరి దృష్టి ఈ ఘటనపై పడింది. అయితే, దీనిని నిబంధనల ఉల్లంఘనగా భావించిన అధికారులు లోవరాజును సస్పెండ్ చేశారు.

ఈ విషయం సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందటంతో లోకేశ్ స్పందించారు. డ్రైవర్ లోవరాజు సరదాగా చేసిన డ్యాన్స్ వల్ల ప్రయాణికులకే కాదు, బస్సు ప్రయాణానికి కూడా ఎటువంటి అంతరాయం కలగలేదని గుర్తించారు. ఆయనపై తీసుకున్న సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయించాలని లోకేశ్ తక్షణమే హామీ ఇచ్చారు. అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం లోవరాజును కుటుంబంతో కలుసుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు.

లోవరాజు కుటుంబంతో సమావేశమైన లోకేశ్, వారికి భరోసా కల్పించారు. పనిలో జరిగిన సరదా కారణంగా అన్యాయానికి గురికాకుండా చేయడమే తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. లోవరాజు లాంటి వారిని ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి మరింత తోడ్పాటు అందించగలమని అన్నారు.