కాంగ్రెస్ : నక్కతోకా లేకపోతే కుక్కతోకా ?

కాంగ్రెస్ పార్టీ విషయమై ప్రస్తుతం రాజకీయావర్గాల్లో చర్చ మొదలైంది. ఏపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి యాదవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే నక్కతోక తొక్కినట్లే అన్నారు. తమ పార్టీ మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పాటవుతుందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు రఘువీరా. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసినా చెప్పుకోతగ్గ స్ధాయిలో సీట్లు వస్తాయట. కాబట్టే ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీనే నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని రఘువీరా చెబుతున్నారు. మరి ఏ ధైర్యంతో రఘువీరా ఇటువంటి మాటలు చెబుతున్నారో అర్ధం కావటం లేదు. కొంతకాలంగా తెలుగుదేశంపార్టీతో కలిసున్నారు కదా బహుశా చంద్రబాబు జాడ్యం ఏమన్నా రఘువీరాను కూడా పట్టుకున్నట్లుంది.

సరే, రఘువీరా చెబుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ నక్కతోకేనా అనే సందేహం మొదలైంది. అడ్డుగోలుగా రాష్ట్ర విభజన చేసిన కారణంగా పోయిన ఎన్నికల్లో జనాలు కాంగ్రెస్ పార్టీకి కొర్రు కాల్చి వాతపెట్టారు. అప్పటికి ఇఫ్పటికీ పార్టీలో వచ్చిన మార్పేమీ లేదు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదా ఇస్తామని ఏఐసిసి అధ్యక్షుడు రాహూల్ గాంధి హామీ ఇవ్వటం తప్పితే. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఎవరిలోను లేదు. అదే పద్దతిలో రాష్ట్రంలో కూడా ఒక్కసీటు కూడా గెలిచే అవకాశం లేదు.

క్షేత్రస్ధాయిలో వాస్తవాలు ఇలా వుంటే తమ పార్టీతో పొత్తు అన్నది నక్కతోక తొక్కటం లాంటిదని రఘువీరా చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. నాలుగు సీట్లు గెలవటం మాట అటుంచితే అసలు 175 సీట్లలో గట్టి అభ్యర్ధులను పోటీకి దించటమే ఎక్కువన్నట్లుంది పార్టీ పరిస్ధితి. ఈ పరిస్ధితుల్లో కాంగ్రెస్ పార్టీ అన్నది నక్కతోక ఎలాగవుతుందో అర్ధం కావటం లేదు. అందుకే బిజెపి విశాఖపట్నం ఎంపి కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీది నక్కతోక కాదని కుక్కతోకగా రియాక్ట్ అవ్వటం గమనార్హం. పొత్తు పెట్టుకునే ముందు కాంగ్రెస్ పార్టీది నక్కతోకా లేకపోతే కుక్కతోకా అన్నది జాగ్రత్తగా చూసుకోవాలని సలహా ఇచ్చారు. నక్కతోక అనుకుని తొక్కితే కుక్క కరిచే ప్రమాదముందని హెచ్చరించారు. అందుకే ఇపుడు కాంగ్రెస్ పార్టీ అన్నది నక్కతోకా లేకపోతే కుక్కతోకా అనే అంశంపై చర్చ మొదలైంది.