లిస్ట్ పెద్దదే… జిల్లాల వారీగా కూటమిలో కట్టప్పలు!!

ఏపీలో వైఎస్ జగన్ ని ఎలాగైనా గద్దె దించాలని జనసేన, బీజేపీలతో టీడీపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పైగా ఈ పొత్తు ప్రయత్నాల్లో భాగంగా ఎన్నో చివాట్లు కూడా తిన్నట్లు పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పుకున్నారు! ఆ సంగతి అలా ఉంటే… ఈ కూటమి వల్ల టీడీపీలో కీలకమైన నేతలు, సీనియర్లు, పార్టీకోసం అహర్నిశలు పనిచేసిన వారిలో కొంతమందికి టిక్కెట్లు దక్కకుండ పోయాయి. చంద్రబాబు అనుకుంటే వారి కూడా దక్కేవే కానీ… వలస నేతలు, డబ్బున్న నేతలు ఇంటికి ఒకటికంటే ఎక్కువ టిక్కెట్లు ఎగరేసుకుపోవడంతో అది కాస్తా మిస్సయ్యింది.

ఇలా టిక్కెట్లు మిస్ చేసుకున్న నేతల్లో టీడీపీకి చెందినవారే కాకుండా… జనసేన నుంచి ఆశించినవారు కూడా ఉన్నారు! అయితే వారి ప్రభావం ఏ మేర ఉంటుందనే సంగతి కాసేపు పక్కనపెడితే… టీడీపీలో టిక్కెట్ దక్కించుకోలేకపోయి, అసంతృప్తిగా ఉన్న కీలక నేతలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఆయా జిల్లాల్లో వీరి సహకారం ఉంటుందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. సహకారం లేకపోతే కూటమికి జరిగే డ్యామేజ్ కూడా చర్చనీయాంశం అవుతుంది. ఆ లిస్ట్ ఇప్పుడు చూద్దాం…!

టీడీపీ విషయంలో ప్రధానంగా కృష్ణా జిల్లా విషయానికొస్తే… టీడీపీ నుంచి 41 ఏళ్లలో దేవినేని కుటుంబానికి టిక్కెట్ లేకుండా ఏనాడు ఎన్నికలు జరగలేదనే చెప్పాలి! ఈ క్రమంలో మైలవరం నుంచి టిక్కెట్ ఆశించిన దేవినేని ఉమకు టిక్కెట్ దక్కలేదు. దీంతో… ఆయన పైకి మౌనంగా ఉన్నట్లు కనిపిస్తున్నా.. ఆయన అనుచరులు మాత్రం వసంత కృష్ణప్రసాద్ కు సహకరించడం కచ్చితంగా అనుమానమే అని అంటున్నారు.

ఇదే సమయంలో బొమ్మసాని, దేవదత్‌, బుద్దా వెంకన్న, జలీల్‌ ఖాన్, మండలి బుద్ద ప్రసాద్‌, వేదవ్యాస్‌ ల సహకారం ఏ మేరకు ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. వీరిలో ఎవరైనా తెరవెనుక తన అసంతృప్తిని చేతల్లో చూపించడానికి ప్లాన్ చేస్తే… అది బాబు & కో కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. పైగా.. రాజకీయాల్లో స్వార్ధాలు ఉంటాయే తప్ప త్యాగాలు ఉండవుగా!!

ఇదే సమయంలో… గుంటూరు జిల్లాలో కోడెల కుటుంబం పరిస్థితి కూడా ఇదే! గుంటూరు జిల్లాలో గత ఎన్నికల వరకూ కోడెల హవా బాగానే నడిచింది. అయితే… అనూహ్యంగా చంద్రబాబుకు ఎంతో సాన్నిహిత్యంగా ఉండే కోడెల శివప్రసాద్ మరణానంతరం ఆయన కుటుంబాన్ని చంద్రబాబు పక్కన పెట్టేశారు. దీంతో.. ఆయన శివప్రసాద్ కుమారుడు ఇప్పుడు సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణకు పక్కలో బల్లెంలా తయారయ్యారనే చర్చ మొదలైంది.

ఇదే సమయంలో… కోడెల ఫ్యామిలీతో పాటు ఆలపాటి రాజా, కొమ్మాళ్లపాటి శ్రీధర్‌ కు టిక్కెట్లు దక్కలేదు. దీంతో కూటమి ప్రకటించిన అభ్యర్థులకు వీరి మద్దతు ఎంత వరకు ఉంటుందనేది కాస్త బలమైన అనుమానంగానే కన్పిస్తోంది. ఇదే సమయంలో… కందుకూరు టిక్కెట్‌ ఆశించిన ఇంటూరి రాజేష్‌ అయితే మరో అడుగు ముందుకేసి.. ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే ఇండిపెండెంటుగా నిలబడతానంటున్నారు.

శ్రీకాకుళం విషయానికొస్తే… గూండా లక్ష్మీదేవమ్మను పక్కన పెట్టడం, పాతపట్నం టిక్కెట్ ఆశించిన కలమట వెంకటరమణ ఇప్పటికే అసమ్మతి రాగం అందుకున్నట్లు తెలుస్తుండటంతో… శ్రీకాకుళంలో కూటమికి కాస్త బ్యాడ్ న్యూసే అని అంటున్నారు. మరోపక్క విజయనగరంలో చంద్రబాబుకు నమ్మినబంటులా ఉన్న కిమిడి కళా వెంకట్రావు కర్రొతు బంగార్రాజు, కేఏ నాయుడు కుటుంబాలు ఏ మేరకు సహకరిస్తాయనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నే!

ఇదే క్రమంలో… విశాఖలో సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి ఈసారి టిక్కెట్ దక్కలేదు. దీంతో… ఈయన అనుచరుల ఎఫెక్ట్ కూటమికి గట్టిగానే తగిలే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో మాడుగుల టిక్కెట్ ఆశించిన రామానాయుడు పరిస్థితి కూడా అదే అని చెబుతున్నారు.

ఇక్కడ గోదావరి జిల్లాల విషయానికొస్తే… కాకినాడలో పిల్లి అనంతలక్ష్మీ, పిఠాపురంలో వర్మల సహకారం ఏ మేరకూ ఉంటుందనేది చూడాలి.. ఇక వెస్ట్ లోని ఉంగుటూరులో గన్ని వీరాంజనేయులు రాజీపడ్డట్టు కన్పించినా.. పెర్ఫార్మెన్స్ వేరేగా ఉండే ప్రమాదం లేకపోలేదని చెబుతున్నారు. ఇక గోపాలపురం టిక్కెట్‌ మద్దిపాటి వెంకటరాజుకు.. కెఎస్‌ జవహర్, పీతల సుజాత, ఉండిలో కలవపూడి శివ ఎఫెక్ట్‌ ఏ మేరకు ఉంటుందోననే విషయం ఇప్పుడు కూటమిలో కొత్త టెన్షన్ కి కారణం అని అంటున్నారు.

ఇక రాయలసీమ వైపు వెళ్తే… నెల్లూరులోని కోవూరు లో అనూహ్యంగా వేమిరెడ్డి ఫ్యామిలీకి టిక్కెట్ దక్కడంతో.. పోలంరెడ్డి ఫ్యామిలీ ఫీల్డ్ లో ఏ మేరకు సహకరిస్తుందనేది చూడాలి. ఇదే సమయంలో.. ధర్మవరంలో పరిటాల శ్రీరాం, అనంతలో ప్రభాకర్ చౌదరి, అనంత లోక్ సభ స్థానంలో జేసీ పవన్ రెడ్డి, తిప్పేశ్వామి, హనుమంతరాయ్య చౌదరి, ఉమామహేశ్వర్ రాయుడు ల ప్రభావం ఏ మేరకు అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా ఉంది. తాజాగా తిరుపతిలో సుగుణమ్మ ఎఫెక్ట్ కూడా గట్టిగానే ఉండొచ్చని అంటున్నారు. మరి వీరి నుంచి కూటమికి ఎలాంటి ఎఫెక్ట్ ఉందబోతోందనేది వేచి చూడాలి!