ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల మధ్య నెలకొన్న యుద్ధం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడంలేదు. ఇప్పటికే మంత్రిపై ఎస్ఈసీ ఆంక్షలు విధించడం.. ఆయన హైకోర్టుకు వెళ్లి ఊరట పొందడం.. మరోవైపు ఎస్ఈసీపై మంత్రి హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడం వంటి పరిణామాలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలో నిమ్మగడ్డ కీలక నిర్ణయం తీసుకున్నారు.
పెద్దిరెడ్డి నియోజకవర్గం పుంగనూరులో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఆ నియోజకవర్గంలో దాదాపు చాలా పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.బెదిరింపులు, బలవంతపు ఉపసంహరణలతో అక్కడ ఏకగ్రీవాలు చేశారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం హైకోర్టుకు చేరగా.. వాటిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఎస్ఈసీని కోర్టు ఆదేశించింది. దీంతో కలెక్టర్లపై ఆధారపడకుండా తానే అక్కడ పర్యటించాలని నిమ్మగడ్డ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
సోమవారం ఆయన పుంగనూరులో పర్యటించి ఏకగ్రీవాలు ఎలా జరిగాయనే అంశాన్ని ఆరా తీయనున్నారు. అనంతరం హైకోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం నిమ్మగడ్డను పుంగనూరు రావొద్దని చెబుతున్నట్టు తెలుస్తోంది. ఆయన అక్కడకు వస్తే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ రోజు ఏం కానుందో వేచి చూడాలి.