పుంగనూరులో జరిగిందిది… పోలీసు అధికారుల సంఘం కీలక డిమాండ్!

పోలీసులపై దాడి జరిగితే ప్రజాసంఘాలు, మానవహక్కుల సంఘాలు, ప్రజలూ.. ఎవ్వరూ సానుభూతి ఎందుకు చూపరు. మేము సమాజంలో భాగం కాదా. ప్రజలకోసం పగలనకా రాత్రనక పనిచేసే పోలీసులు కూడా మనుషులే అనే విషయం ఎందుకు గ్రహించరు అంటూ ఎమోషనల్ అవుతుంది పోలీస్ అధికారుల సంఘం.

అవును… తాజాగా పుంగనూరులో జరిగిన ఘటన వెనుక అసలు కారణాలు చెబుతున్నారు పోలీస్ అధికారుల సంఘం పెద్దలు. ఆ ఘటనలో సుమారు 50 మంది పోలీసులకు తీవ్రగాయాలయ్యాయని.. వారిలో 13 మంది ఆసుపత్రిలో ఉన్నారని.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా… ముఖ్యంగా చంద్రబాబు తీరును పోలీసు అధికారుల సంఘం తప్పుబట్టింది. పుంగనూరు ఘటనను తీవ్రంగా ఖండించిన పోలీసు అధికారుల సంఘం.. మీ రాజకీయాల కోసం మా పై దాడులు చేయిస్తారా అంటూ ప్రశ్నించింది. ఈ ఘటనతో ఒక పథకం ప్రకారమే పోలీసులను హతమార్చే భారీ కుట్ర జరుగుతున్నట్లు అనుమానాలు రేకెత్తుతున్నాయని సంఘం తెలిపింది.

పోలీసులను హత్య చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని.. పోలీసులను హతమార్చేందుకు కాకుంటే తుపాకులు, రాడ్లు, కర్రలతో టీడీపీ నాయకులు ఎందుకు వచ్చారని పోలీసు అధికారుల సంఘం ప్రశ్నించింది. ఇదే సమయంలో కేవలం ఆరోపణలకు పరిమితం కాకుండా… ఈ ఘటనపై ఎంక్వైరీ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరింది పోలీసు అధికారుల సంఘం.

ఇదే క్రమంలో పుంగనూరులో పోలీసులపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డీజీపీ, ప్రభుత్వాన్ని కోరిన పోలీసు అధికారుల సంఘం… పోలీసులపై కొంతమంది ఉద్ధేశపూర్వకంగానే దాడి చేశారని, శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసులపైనే దాడులకు తెగబడ్డారని సంఘం అధికారులు ఆరోపించారు.

ఈ సందర్భంగా… 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు చాలా దారుణంగా మాట్లాడారని ఆరోపించిన పోలీసుల సంఘం… పోలీసులను అసభ్య పదజాలంతో దూషించారని మండిపడింది. అనంతరం… చంద్రబాబు ప్రభుత్వంలో కూడా పోలీసు వ్యవస్థలో తామే పనిచేశామని గుర్తుచేసింది. ఈ సందర్భంగా… చంద్రబాబును తక్షణమే అరెస్ట్ చేయాలని అధికారులు డిమాండ్ చేశారు.