ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నది జలాల వినియోగంలో ఏర్పడిన జల వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. ఇరు రాష్ట్రాల నాయకులు నోటికి పని చెప్తూ వివాదాన్ని మరింత జటిలం చేస్తున్నారు. తాజాగా ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ వ్యవహారంపై స్పందించారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని వేస్ట్ చేస్తున్నారని… ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డుకుని తీరతామని మంత్రి పేర్కొన్నారు.
కేంద్రం సూచించిన కేటాయింపులకు లోబడే ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నామని, ఏపీకి కేటాయించిన నీటిని మాత్రమే వినియోగించుకుంటున్నా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోందని మంత్రి మండిపడ్డారు. శ్రీశైలం డ్యామ్ నిండకూడదనే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని, కేఆర్ఎంబీ ఆదేశాలు జారీ చేసినా ఎందుకు విద్యుత్ ఉత్పత్తి ఆపలేదని ప్రశ్నించారు. విద్యుత్ ఉత్పత్తితో కృష్ణా జలాలు వృథా అవుతున్నాయని మంత్రి అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ, తెలంగాణ ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తేవాలని సీఎం జగన్ ఎప్పుడో చెప్పారని అనిల్ కుమార్ గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమ ప్రాజెక్టులు కడుతోందని ఆరోపణలు చేశారు. దీనిపై కేఆర్ఎంబీకి, ప్రధానికీ లేఖ రాస్తామన్నారు. విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణా వినియోగించిన నీటి మొత్తాన్ని వారి కేటాయింపుల నుంచి మినహాయించాలని కేంద్రాన్ని కోరతామని మంత్రి చెప్పుకొచ్చారు.
తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే సమస్య పరిష్కారమవుతుందనుకుంటే మేము మీకంటే బాగా చేయగలమని తెలంగాణ మంత్రులకి అనిల్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ తీరుపై చేతకాక కాదని… సంయమనం పాటిస్తున్నామని హెచ్చరించారు.